బాధితుల్లో నమ్మకం పెంచాలి
ప్రజల విశ్వాసాన్ని పొందాలి
సీపీ సీపీ సన్ ప్రీత్ సింగ్
ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ తనిఖీ
కాకతీయ, హనుమకొండ : పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడిలో న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించడం పోలీసుల ముఖ్య బాధ్యత అని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. గురువారం ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి అక్కడి పనితీరును సమీక్షించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు ధర్మసాగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రావు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన సీపీ, స్టేషన్ పరిధిలోని గ్రామాల పరిస్థితులు, ప్రజల జీవన శైలి, అక్కడ అధికంగా నమోదవుతున్న నేరాలు, రౌడీ షీటర్లు, అనుమానితుల వివరాలు వంటి అంశాలను ఇన్‌స్పెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరు, బీట్ వ్యవస్థ, పెట్రోలింగ్ విధానం, రికార్డుల నిర్వహణ వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన కేసులు, పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులకు సంబంధించిన రికార్డులను సీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించాలని సూచించారు. విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా కర్తవ్యబద్ధంగా పనిచేయాలని, పారదర్శకంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందాలని సీపీ ఆదేశించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ఎస్‌ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



