ట్రంప్ టారిఫ్ షాక్.. తెలుగు రైస్ ఇండస్ట్రీకి పెనుముప్పు సంకేతాలు!
అమెరికన్ రైస్ ఇండస్ట్రీ ఫిర్యాదులు పెరగడంతో ట్రంప్ ఆగ్రహం
భారత్–చైనా–థాయిలాండ్ నుంచి తక్కువ ధర బియ్యం దిగుమతులే ప్రధాన సమస్య
భారత బియ్యంపై కఠిన చర్యల దిశగా ట్రంప్ అడుగులు
కాకతీయ, ఇంటర్నేషనల్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ భారత బియ్యం ఎగుమతులపై కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల వైట్ హౌస్‌లో అమెరికన్ రైస్ ఇండస్ట్రీ ప్రతినిధులతో ఆయన చేసిన సమావేశం పెద్ద చర్చకు దారితీసింది. ఈ సమావేశంలో అమెరికా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించిన అంశాలు ఇప్పుడు భారత్ రైస్ రంగానికే కాదు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రైస్ పరిశ్రమకు పెద్ద ఆందోళనగా మారాయి.
ఈ సమావేశంలో మెరీల్ కెనడీ అనే ప్రతినిధి ట్రంప్‌కు దక్షిణ అమెరికా రాష్ట్రాల్లో బియ్యం రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించారు. తక్కువ ధరలకు భారత్, చైనా, థాయిలాండ్ వంటి దేశాల నుంచి బియ్యం అమెరికా మార్కెట్లో పెద్ద ఎత్తున దిగుమతి అవుతోందని, దీని వల్ల స్థానిక రైతులు తీవ్ర నష్టంలోకి వెళ్లిపోతున్నారని తెలిపారు. పోర్టోరికో మార్కెట్‌లో కూడా అమెరికా బియ్యం స్థానాన్ని చైనా ఆక్రమించిందని ఆమె పేర్కొన్నది ఓ కీలక అంశం.
దీనిపై ట్రంప్ కూడా వెంటనే స్పందిస్తూ, “భారత్ వంటి దేశాలపై సుంకాలు పెంచితే సమస్య రెండు నిమిషాల్లో పరిష్కారం అవుతుంది” అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా అమెరికాలో బియ్యం డంపింగ్ చేస్తున్న దేశాల పూర్తి జాబితాను పంపించాలని ఆదేశించారు. ఈ వ్యాఖ్యలతో భారత బియ్యం ఎగుమతులపై కొత్త టారిఫ్‌లు పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.
ప్రతి సంవత్సరం భారత్ నుంచి అమెరికాకు సుమారు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అవుతోంది. దీని విలువ దాదాపు రూ. 3,000 కోట్లు. ఇందులో 60-70 శాతం బాస్మతి బియ్యం కాగా, మిగతా భాగం నాన్ బాస్మతి కేటగిరీకి చెందుతుంది. నాన్ బాస్మతి విభాగంలో ప్రధానంగా సోనామసూరి బియ్యం ఎగుమతవుతుంది, ఇది ఎక్కువ శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచే అమెరికాకు వెళుతుంది.
ప్రస్తుతం బాస్మతి పై సుంకాలు 0 నుంచి 2.5 శాతం మాత్రమే ఉండగా, నాన్ బాస్మతి బియ్యం పై సుమారు 15% సుంకం ఉంది. ఒకవేళ ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేకంగా భారత బియ్యం పై టారిఫ్‌లు పెంచితే ఈ సుంకం 25% నుండి 40% వరకు పెరిగే అవకాశముందని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ నిజంగా టారిఫ్‌లు పెరిగితే అమెరికాలో సోనామసూరి ధర భారీగా పెరుగుతుంది. దీంతో ప్రవాస భారతీయులు ప్రత్యేకించి దక్షిణ భారతీయులు తక్కువ ధరలో లభించే థాయిలాండ్ బియ్యం లేదా అమెరికన్ రైస్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ఫలితంగా తెలుగు రాష్ట్రాల రైస్ మిల్లర్లు, ఎగుమతిదారులు ఎదురుచూస్తున్న లాభాలు తగ్గిపోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త అవకాశాలు వెతుకునే పరిస్థితి రావచ్చు. మొత్తం మీద, ట్రంప్ ప్రభుత్వం తీసుకునే కొత్త సుంకాల నిర్ణయం భారత రైస్ ఎగుమతి రంగానికే కాకుండా, తెలుగు రాష్ట్రాల రైస్ పరిశ్రమపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను ఏ దిశలో నడిపిస్తుందో చూడాలి.


