కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రపంచంలో ఇప్పటి వరకు ఎనిమిది యుద్ధాలను నిలువరించానని.. లక్షల మంది ప్రజల ప్రాణాలు ఆయా యుద్ధాల కారణంగా గాలిలో కలవకుండా కాపాడిన ఘనత తనదేనని పదే పదే చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోబెల్ శాంతి బహుమతి ఇచ్చి.. ఈ ప్రపంచం.. తనను గౌరవించాలని కూడా మంకు పట్టు పట్టిన విషయం తెలిసిందే. అయితే.. అప్పట్లో నోబెల్ పురస్కార ఎంపిక కర్తలు.. అబ్బే.. ట్రంప్ చేసింది.. ఉత్తుత్తి శాంతి ప్రక్రియేనని.. ఇది నిలవబోదని.. కుండబద్దలు కొట్టారు. అచ్చంగా వారు చెప్పినట్టే ఇజ్రాయెల్-గాజాల మధ్య ట్రంప్ కుదిర్చిన శాంతి ఒప్పందం బెడిసికొట్టింది. ఇక, తాజాగా రష్యా-ఉక్రెయిన్ మధ్య కూడా ఆయన శాంతిని నెలకొల్పుతున్నానని చెబుతున్నా.. అది కూడా సాకారం కావడం లేదు.
ఇటీవల గత వారం ఇంకేముంది.. ఉక్రెయిన్-రష్యా దారికి వచ్చాయి.. ఈ రెండు దేశాల్లోనూ శాంతి సుమాలు విలసిల్లుతాయని ప్రపంచానికి ట్రంప్ ఆర్బాటంగా చెప్పారు. కానీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్.. ట్రంప్ కంటే రెండాకులు ఎక్కువడే చదివిన గడుసరి!. దీంతో డమాస్కస్ ప్రాంతం ఇస్తే.. యుద్ధం ఆపేస్తామని చెబుతున్నారు. కానీ, డమాస్కస్ ఇస్తే.. ఇక, ఉక్రెయిన్‌కు గుండె కాయపోయినంత పని!. దీంతో ట్రంప్ ప్రతిపాదనలు.. చర్యలు అన్నీ బుట్టదాఖలయ్యాయి. దీంతో రష్యా యుద్ధాన్ని విరమించేందుకు ససేమిరా అంటోంది. ఈ క్రమంలో చిర్రెత్తుకొచ్చిన ట్రంప్ మరోసారి ఆంక్షల కొరడా.. అంటూ.. ఝుళిపించినా.. వాటిని మళ్లీ.. అబ్బే ఇవి ఉత్తుత్తివే.. తాత్కాలికమేనంటూ.. పిల్లిమొగ్గలు వేస్తున్నారు. సరే.. మొత్తానికి ట్రంప్ మాత్రం రష్యాపై ఆంక్షలు అయితే విధించారు. ఇవి ఎన్నాళ్లుంటాయి.? ఏం జరుగుతుంది? అనేది పక్కన పెడితే.. రష్యాపై పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు.. ట్రంప్‌తో చర్చించేందుకు పుతిన్ ముఖం చాటేస్తున్నారు. ఈ పరిణామాలే ట్రంప్‌కు మంటపుట్టిస్తున్నాయి.
ఏంటీ ఆంక్షలు..
1. రష్యాకు చెందిన రెండు అతిపెద్ద చమురు కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు విధించారు.
2. రోస్‌నెఫ్ట్, లుకోయిల్ లలో చమురుకంపెనీలు ఉన్నాయి. వీటి నుంచి చమురును ఎవరూ కొనుగోలు చేయరాదని.. రష్యా విక్రయించరాదన్నది ఆంక్షలు.
లక్ష్యం ఏంటి?
1. కీలకమైన చమురును విక్రయించడం ద్వారా వచ్చే సొమ్మును రష్యా యుద్ధానికి వినియోగిస్తోందన్నది అమెరికా అభిప్రాయం.
2. ఈ క్రమంలో రష్యాకు ఆదాయం రాకుండా ఆపేస్తే..తమ దారికి వచ్చి.. తమ మాట వింటుందన్నది ట్రంప్ ఆలోచన.
3. తమ నిర్ణయం రష్యా చమురు రంగంపై ఒత్తిడి పెంచుతుందని, దీనివల్ల రష్యా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందని అమెరికా ఆలోచన.
4. అంతేకాదు.. అమెరికా మిత్ర దేశాలు కూడా తమతో కలవాలని, ఆంక్షలకు కట్టుబడి ఉండాలని అగ్రరాజ్యం కోరడం కొసమెరుపు.(అంటే.. ఒకవేళ ఇతర దేశాలు సహకరించకపోతే.. అమెరికా విధించిన ఆంక్షలు బుట్టదాఖలేనన్నది సుస్పష్టం అవుతోంది.)
5. కానీ.. రష్యా అమెరికా ఒత్తిడికి లొంగుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.


