హెచ్–1బీపై ట్రంప్ బిగ్ బాంబ్!
లాటరీకి చెక్… అధిక వేతనాలకే ప్రాధాన్యం
లాటరీ విధానానికి ముగింపు – ‘వెయిటెడ్ సెలక్షన్’ అమలు
2026 ఫిబ్రవరి 27 నుంచి కొత్త నిబంధనలు
అధిక నైపుణ్యం, ఎక్కువ జీతాల ఆధారంగా వీసాల కేటాయింపు
భారతీయ యువత అమెరికా డ్రీమ్‌కు కొత్త అడ్డంకులు
కాకతీయ, నేషనల్ డెస్క్ : అమెరికాలో ఉద్యోగం సాధించాలనే విదేశీ నిపుణుల ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది ట్రంప్ ప్రభుత్వం. హెచ్–1బీ వర్క్ వీసా విధానాన్ని పూర్తిగా మార్చేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న లాటరీ విధానాన్ని రద్దు చేసి, నైపుణ్యం, వేతన స్థాయి ఆధారంగా వీసాలు కేటాయించే ‘వెయిటెడ్ సెలక్షన్’ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ కొత్త నిబంధనలు 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానున్నాయి. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్–1బీ రిజిస్ట్రేషన్ సీజన్ నుంచే ఈ మార్పులు వర్తిస్తాయి. ప్రతి ఏడాది జారీ అయ్యే సుమారు 85 వేల హెచ్–1బీ వీసాల కేటాయింపుపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.
లాటరీ దుర్వినియోగంపై ఆరోపణలు
లాటరీ విధానం కారణంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకూ హెచ్–1బీ వీసాలు దక్కుతున్నాయని, కొంతమంది యజమానులు తక్కువ వేతనాలకు విదేశీ కార్మికులను తీసుకొచ్చేందుకు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారని యూఎస్‌సీఐఎస్ ఆరోపిస్తోంది. అందుకే ఇకపై అధిక వేతనాలు చెల్లించే, ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఉద్యోగాలకే ప్రాధాన్యం ఇస్తామని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
భారతీయులపై ప్రభావం
అమెరికాలో హెచ్–1బీ వీసాల ద్వారా ఉద్యోగాలు పొందుతున్న వారిలో భారతీయులే అత్యధికం. టెక్ నిపుణులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, వైద్యులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే కెరీర్ ప్రారంభ దశలో తక్కువ ప్యాకేజీలతో అమెరికాలో అడుగుపెట్టే అవకాశాలు ఈ కొత్త విధానంతో మరింత తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా టెక్ కంపెనీలు మాత్రం ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హెచ్–1బీ వీసాలు ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధికి కీలకమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభను ఆకర్షించకపోతే అమెరికా తన ఆధిక్యతను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. మరోవైపు విమర్శకులు మాత్రం స్థానిక ఉద్యోగాలకు రక్షణ అవసరమని వాదిస్తున్నారు. మొత్తానికి హెచ్–1బీపై ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా ఉద్యోగ విపణిలోనే కాదు, వేలాది భారతీయ యువత అమెరికా డ్రీమ్‌పై కూడా పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగుల్చుతోంది.


