తెలంగాణలో ట్రంప్ మీడియా రూ.లక్ష కోట్ల పెట్టుబడి.. ఈ సంస్థ హిస్టరీ ఇదే!
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో టీఎమ్‌టీజీ భారీ పెట్టుబడి ప్రకటన
ట్రంప్ బ్యాన్ తర్వాత పుట్టుకొచ్చిన కంపెనీ
ట్రూత్ సోషల్‌తో టీఎమ్‌టీజీ కి మొదటి పెద్ద బ్రేక్
కాకతీయ, ఇంటర్నేషనల్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన భారీ పేరు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (టీఎమ్‌టీజీ). అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు నేరుగా లింక్ ఉన్న ఈ సంస్థ, రాబోయే 10 ఏళ్లలో తెలంగాణలో రూ.లక్ష కోట్లు పెట్టుబడి పెడతామని చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పెట్టుబడి ప్రధానంగా ఫ్యూచర్ సిటీ, డిజిటల్ టెక్నాలజీ, మీడియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీ, స్ట్రీమింగ్ సేవల విస్తరణపై కేంద్రీకృతమవుతుందని సూచనలు వెలువడుతున్నాయి. తెలంగాణను డిజిటల్ మీడియా హబ్‌గా మార్చే దిశగా ఈ ఇన్వెస్ట్‌మెంట్ కీలక పాత్ర పోషించే అవకాశముంది.
అయితే చాలామందికి ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ అసలు నేపథ్యం ఏంటో తెలియదు. 2021లో అమెరికా క్యాపిటల్ వద్ద జరిగిన అల్లర్ల తర్వాత ట్రంప్‌కు ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు బ్యాన్ విధించాయి. అదే సమయంలో ట్రంప్ తన మద్దతుదారులతో నేరుగా మాట్లాడే ప్లాట్‌ఫార్మ్ అవసరాన్ని గుర్తించి ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్‌ను స్థాపించారు. టీఎమ్‌టీజీ యొక్క మొదటి పెద్ద ప్రాజెక్ట్ ట్రూత్ సోషల్. ఇది ట్రంప్ ఎక్కువగా పోస్టులు చేసే ప్లాట్‌ఫార్మ్. ఈ యాప్ అమెరికా రైట్-వింగ్ వర్గాల్లో విపరీతమైన ఆదరణ పొందింది. కంపెనీ ప్రధాన కార్యాలయం ఫ్లోరిడాలోని సరసోటాలో ఉండగా, టీఎమ్‌టీజీ లో ట్రంప్ రివోకబుల్ ట్రస్ట్‌కు 52 శాతం షేర్ ఉంది.
2024 మార్చి 26న ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్—డిజిటల్ వరల్డ్ అక్విజిషన్ కార్పొరేషన్ అనే SPACతో విలీనం అయి NASDAQ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో డిజెటి అనే టిక్కర్ గుర్తుతో లిస్టయ్యింది. లాభాలు రాకపోయినా, ట్రంప్ పేరు ఉండడం వల్ల కంపెనీ విలువ భారీగా పెరగడం విశేషం. సోషల్ మీడియా దాటి, వార్తలు, వినోదం, పాడ్‌కాస్ట్‌లు, స్ట్రీమింగ్ సేవలు వంటి విభాగాల్లోకి విస్తరించాలని, పూర్తి స్థాయి మీడియా ఎకోసిస్టమ్‌గా మారాలని టీఎమ్‌టీజీ భావిస్తోంది. ఇలాంటి కంపెనీ తెలంగాణలో లక్ష కోట్ల పెట్టుబడి ప్రకటించడం రాష్ట్ర వ్యాపార వాతావరణానికి పెద్ద గుర్తింపు. మొత్తానికి సోషల్ మీడియా బ్యాన్ నుంచి పుట్టుకొచ్చిన ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచ స్థాయి పెట్టుబడిదారుగా మారి తెలంగాణ వంటి అభివృద్ధి రాష్ట్రాల్లో అడుగులు వేస్తోంది. అయితే టీఎమ్‌టీజీ పెట్టుబడి తెలంగాణను అంతర్జాతీయ డిజిటల్, మీడియా, టెక్నాలజీ రంగాల్లో కొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


