నీటి కోసం రోడ్డెక్కిన టీఆర్‌కే నగర్ వాసులు
ఆరు రోజులుగా నీటి సరఫరా నిలిచివేత కాలనీవాసుల ఆందోళన
కాకతీయ, కరీంనగర్ / చింతకుంట : కరీంనగర్ నగరంలోని చింతకుంట పరిధిలోని 15వ డివిజన్ టీఆర్‌కే నగర్ కాలనీలో గత ఆరు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు అందక కాలనీవాసులు రోజువారీ అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.
స్థానికుల వివరాల ప్రకారం, బీఎస్ఎన్ఎల్ చేపడుతున్న అండర్‌గ్రౌండ్ పైపింగ్ పనుల సమయంలో నీటి పైపులు పలు చోట్ల దెబ్బతిని పగిలిపోవడంతో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో కాలనీలో నీటి సమస్య మరింత తీవ్రమైంది.ఇప్పటికే ఎండాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకునే స్థోమత చాలా కుటుంబాలకు లేకపోవడంతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు.నగరపాలక సంస్థ అధికారులు, అండర్‌గ్రౌండ్ పైపింగ్ పనులు చేపడుతున్న సంస్థ ప్రతినిధులు తక్షణమే స్పందించి పగిలిన పైపులను మరమ్మతు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సమ్మయ్య, నారాయణ, లక్ష్మీనారాయణ, శ్రీధర్ బాబు, ఆర్ అనిల్ కుమార్, బి సంపత్, కె విజయ్, సిహెచ్ శేఖర్, డి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


