ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ
ఎలన్ మస్క్‌కు టెస్లా బోర్డు బంపర్ గిఫ్ట్
కార్పొరేట్ చరిత్రలో ప్రపంచ కుబేరుడి రికార్ట్
75 శాతం ఓట్లతో షేర్‌హోల్డర్లు మద్దతు
(కాకతీయ, అంతర్జాతీయం): ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్‌కు చరిత్రలోనే అత్యధిక జీత ప్యాకేజీ ఆమోదించి బంపర్ గిఫ్ట్ ఇచ్చింది కంపెనీ. షేర్‌హోల్డర్లు 75 శాతం ఓట్లతో ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు. దీంతో మస్క్ జీతం ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను తాకింది. ఒక్క కంపెనీ సీఈఓకి ఇంత భారీ రివార్డ్ ఇవ్వడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇది కేవలం జీతం కాదు.. షేర్ల రూపంలో లభించే రివార్డ్ ప్యాకేజీ. మస్క్ నిర్దిష్ట టార్గెట్లను సాధిస్తే, ఆయనకు లక్షల సంఖ్యలో షేర్లు కేటాయించనున్నారు. ప్రస్తుతం టెస్లా మార్కెట్ విలువ సుమారు 1.4 ట్రిలియన్ డాలర్లు. మస్క్‌కు ట్రిలియన్ డాలర్ల పే ప్యాకేజీ అందాలంటే ఆయన ముందున్న సవాల్ చాలా పెద్దది.. ఆ విలువను 8.5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాల్సి ఉంటుంది. ఇది సాధిస్తే టెస్లా మాత్రమే కాదు, ప్రపంచ కార్పొరేట్ రంగానికే కొత్త ప్రమాణం సెట్ అవుతుంది. టెస్లా నెక్ట్స్ బిగ్ మిషన్.. రోబోట్యాక్సీలు. స్వీయ డ్రైవింగ్ టెక్నాలజీతో వాహనాలను రోడ్డెక్కించడానికి మస్క్ భారీ ప్లాన్ సిద్ధం చేశారు. లక్షల సంఖ్యలో రోబోట్యాక్సీలు మార్కెట్లోకి వస్తే, టెస్లా విలువ ఆకాశాన్ని తాకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మస్క్‌కు ఇంత భారీ పే ప్యాకేజీ ఇవ్వడం పట్ల కొందరు షేర్‌హోల్డర్లు, ఆర్థిక నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ టెస్లా బోర్డు మాత్రం మస్క్‌పై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. ఆయన లేకుండా టెస్లా అభివృద్ధి ఆగిపోతుందనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన ఎలన్ మస్క్, ఈ పే ప్యాకేజీతో ఆయన ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా అవతరించే అవకాశం ఉంది.


