ఎరువుల పంపిణీలో పారదర్శకత
బుకింగ్ యాప్‌తో తొలగిని ఇబ్బందులు
రైతులతో కలెక్టర్ పమేలా సత్పతి
జిల్లాలో ఎరువుల దుకాణాలు, గోదాంల తనిఖీ
కాకతీయ, కరీంనగర్ :యూరియా బుకింగ్ యాప్ పనితీరుపై రైతుల అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్వయంగా తెలుసుకున్నారు. మంగళవారం కొత్తపల్లి మండలంలోని డీసీఎంఎస్ చింతకుంట, డీసీఎంఎస్ మల్కాపూర్ ఎరువుల దుకాణాలు, గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల సరఫరా, యూరియా అమ్మకాలు, నిల్వల రిజిస్టర్ పరిశీలించారు. గోదాంలో నిల్వ ఉన్న ఎరువుల స్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా యూరియా కొనుగోలు కోసం వచ్చిన రైతులు రిట్టనేని మల్లయ్య, గులిగెపు బక్కయ్య, సత్యనారాయణ రెడ్డితో మాట్లాడారు. ఆన్లైన్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ విధానం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. యాప్ వల్ల వ్యయప్రయాసలు తగ్గాయని, గంటల తరబడి క్యూల్లో నిలబడే అవసరం లేకుండా పోయిందని రైతులు తెలిపారు. తమకు అనుకూల సమయంలో యూరియా బుక్ చేసుకుని సులభంగా పొందుతున్నామని చెప్పారు. ఫోన్ లేకపోయినా దుకాణానికి వస్తే డీలర్ ఆన్లైన్‌లో నమోదు చేసి వెంటనే ఎరువులు ఇస్తున్నారని వివరించారు. డీలర్‌కు ఫోన్ చేసి కూడా యూరియా బుక్ చేసుకునే సౌకర్యం ఉందని పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరిగిందన్నారు. భూమి విస్తీర్ణాన్ని బట్టి యాప్ యూరియా కోటాను నిర్ణయిస్తోందని తెలిపారు. అక్రమాలకు తావులేకుండా క్రమబద్ధమైన పంపిణీ జరుగుతోందని చెప్పారు. గతంలో ఎదురయ్యే రద్దీ, గందరగోళం, ఒత్తిడి ఈ విధానంతో తగ్గిందన్నారు. పని ఒత్తిడి తగ్గిందని డీలర్లు తెలిపారు. తనిఖీలలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, మార్క్‌ఫెడ్ డీఎం గౌరీ నాగేశ్వరరావు, వ్యవసాయ సహాయ సంచాలకుడు రణధీర్, ఏఈఓ రాజేంద్రప్రసాద్, ఎంఏఓ సంతోష్ పాల్గొన్నారు.


