స్మార్ట్ ఫోన్లతో అంగన్వాడీ సేవల్లో పారదర్శకత
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
దామెర బండ్ అభివృద్ధికి శ్రీకారం
కాకతీయ, పరకాల : మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గురువారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల టౌన్‌తో పాటు పరకాల,దామెర,ఆత్మకూరు, నడికూడ మండలాల పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం ద్వారా సేవల్లో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. పరకాల ప్రాజెక్ట్ పరిధిలో 165 మందికి స్మార్ట్ ఫోన్లు అందజేసినట్లు పేర్కొన్నారు. ఐసిడిఎస్ ద్వారా గర్భిణీలు, బాలింతలు,0-6 సంవత్సరాల పిల్లలకు ఆరు రకాల సేవలు అందిస్తున్నామని, పోషకాహారం పంపిణీ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో ఈ ఫోన్లు ఉపయోగపడతాయని వివరించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యను కూడా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.అనంతరం పరకాల పట్టణంలో రూ.3.14 కోట్ల వ్యయంతో చేపట్టనున్న దామెర బండ్ పునరుద్ధరణ పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా దామెర బండ్‌ను ఆధునికంగా అభివృద్ధి చేసి ప్రజలకు ఆకర్షణీయ ప్రదేశంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. చెరువు చుట్టూ రింగ్ బండ్ ఏర్పాటు చేసి, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఈ పనులు పూర్తయ్యాక పరకాల పట్టణానికి ప్రత్యేక గుర్తింపు లభించడంతో పాటు ప్రజలకు విశ్రాంతి, వినోదానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, కౌన్సిలర్లు,అంగన్వాడీ టీచర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


