ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనం… రైతుల్లో తీవ్ర ఆందోళన
కాపర్ వైర్ ఎత్తుకెళ్లిన దుండగులు
సాగునీరు నిలిచిపోయి పంటలకు ముప్పు
కాకతీయ, ఏటూరునాగారం: ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి శివారులో దొంగల హల్చల్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు బుచ్చిరెడ్డి పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి, అందులోని విలువైన కాపర్ వైర్‌ను ఎత్తుకెళ్లారు.
నాట్లు వేసిన రైతులు సాగునీటికి ఎదురుచూస్తున్న కీలక సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతినడంతో పొలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి, పంటలకు నీరు అందక భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వారు వాపోతున్నారు. ఇటీవల గ్రామ శివార్లలో ఇలాంటి దొంగతనాలు పెరుగుతున్నాయని, రాత్రివేళ గస్తీ లేకపోవడమే ఇందుకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులకు, విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను వెంటనే పునరుద్ధరించి విద్యుత్ సరఫరా పునఃప్రారంభించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


