ఉపాధ్యాయులందరికీ బదిలీ, మెమోలు జారీ
కురిక్యాల ఘటనపై ఎమ్మెల్యే సత్యం సీరియస్
కరీంనగర్ జిల్లా విద్యాశాఖలో హాట్ టాపిక్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై అటెండర్ యాకూబ్ పాషా లైంగిక వేధింపుల ఘటనపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే సత్యం హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తో ఫోన్‌లో మాట్లాడారు. సంఘటనపై పూర్తి నివేదిక తీసుకోవాలని పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరిని వెంటనే బదిలీ చేయాలని బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని డైరెక్టర్‌కి సూచించారు.

ఎమ్మెల్యే సత్యం ఆదేశాల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి కురిక్యాల పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులందరికీ మెమోలు జారీ చేశారు. అదేవిధంగా వారిని ఇతర పాఠశాలలకు బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ బాలికల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం అని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని స్థాయిల్లో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిందితుడు యాకూబ్ పాషాను పూర్తిగా సేవల నుండి తొలగించాలని కూడా సూచించాం అని తెలిపారు.


