సర్పంచులకు శిక్షణ తప్పనిసరి
నూతన సర్పంచులందరూ హాజరుకావాలి
గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ జాయింట్ డైరెక్టర్ ఎస్. ప్రసూన రాణి
కాకతీయ, గీసుగొండ : నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి సర్పంచులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని తెలంగాణ గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ జాయింట్ డైరెక్టర్ ఎస్. ప్రసూన రాణి స్పష్టం చేశారు. మండలంలోని గంగదేవి పల్లిలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని శనివారం జిల్లా అధికారులతో కలిసి ఆమె సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. శిక్షణ నిర్వహణపై పలు సూచనలు చేశారు. జిల్లాలోని 11 మండలాల నుంచి మొత్తం 317 మంది నూతన సర్పంచులకు నాలుగు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా పంచాయితీ అధికారి కటకం కల్పన తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించుకునేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని ప్రసూన రాణి పేర్కొన్నారు.
100 శాతం హాజరు లక్ష్యం
శిక్షణకు 100 శాతం సర్పంచులు హాజరయ్యేలా ఎంపీడీపీలు, ఎంపీఓలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చురుకుగా పనిచేయాలని అధికారులంతా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ రాం రెడ్డి, జిల్లా పంచాయితీ అధికారి కటకం కల్పన, ఎంపీడీఓ వెన్న కృష్ణవేణి, టీవోటీలు మలోత్ శంకర్, లెక్కల అరుంధతి, పాక శ్రీనివాస్, కూచన ప్రకాశ్, చంద్రకాంత్, జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌలి, సర్పంచ్ కూసం స్వరూప రమేష్ తదితరులు పాల్గొన్నారు.


