కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం
గుర్తుతెలియని వ్యక్తి మృతి
కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు రైల్వే పట్టాలపై ఓ వ్యక్తి శరీరం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదవశాత్తు రైలు కిందపడి మృతిచెందాడా, లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదని అధికారులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. మృతుడిని గుర్తించిన వారు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.


