పెళ్లిరోజే విషాదం… రైల్వే ఉద్యోగి మృతి
విద్యుత్ షాక్‌కు గురై నవీన్ మృతి
మణుగూరు రైల్వే స్టేషన్‌లో ఘటన
భార్య ఆరు నెలల గర్భవతి.. కుటుంబంలో తీవ్ర విషాదం
కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రైల్వే స్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే సిగ్నల్ విభాగంలో ఈఎస్ఎం గా పనిచేస్తున్న రంప నవీన్ (33) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు నవీన్ తనకు కొత్తగా కొనుగోలు చేసిన కారును నిలిపేందుకు పాత రన్నింగ్ రూమ్ వద్ద ఉన్న షెడ్డు తొలగిస్తున్న సమయంలో అక్కడ ఉన్న విద్యుత్ వైర్ తగలడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తగలడంతో నవీన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనలో అత్యంత విషాదకర విషయం ఏమిటంటే అదే రోజు నవీన్ పెళ్లిరోజు కావడం. మరోవైపు ఆయన భార్య ఆరు నెలల గర్భవతిగా ఉన్నట్లు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో మణుగూరు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు సంఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.



