జంపన్నవాగులో విషాదం..!
పుణ్యస్నానమే ప్రాణాంతకం
నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన భక్తుడు
గాలింపునంతరం మృతదేహం లభ్యం
అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
కాకతీయ, మేడారం బృందం : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర మొదటి రోజే విషాద ఛాయలు అలుముకున్నాయి. జనవరి 28న పవిత్ర జంపన్నవాగులో స్నానం కోసం దిగిన ఓ భక్తుడు నీటి ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జాతరలో పాల్గొన్న భక్తుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మంచిర్యాల జిల్లాకు చెందిన కిరణ్(45) అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం అమ్మవార్ల దర్శనానికి మేడారం వచ్చాడు. సంప్రదాయం ప్రకారం జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరించేందుకు వాగులోకి దిగిన సమయంలో నీటిలో గల్లంతయ్యాడు. కళ్లముందే జరిగిన ఘటనతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల భక్తులు షాక్‌కు గురయ్యారు.
రంగంలోకి రెస్క్యూ బృందాలు
సమాచారం అందుకున్న వెంటనే ఎస్డీఆర్ ఎఫ్, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గంటల తరబడి జంపన్నవాగులో గాలింపు చర్యలు చేపట్టాయి. చివరకు మృతదేహాన్ని వెలికితీయడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జంపన్నవాగులో కొన్ని చోట్ల అకస్మాత్తుగా లోతు పెరగడం, ప్రవాహం బలంగా ఉండటమే ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. జాతర ప్రారంభంతో భక్తుల రద్దీ పెరగడంతో వాగు పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న అప్రమత్తత లోపమే ప్రాణాంతకంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు.


