కాకతీయ, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగల గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ దుసలపాటి లొద్ది జలపాతంలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి జలపాతం వీక్షించడానికి వచ్చిన యువకుడు నీటిలో పడి మృతి చెందాడు.
స్థానిక సమాచారం ప్రకారం ఆదివారం ఉదయం హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన మహాన్వేష్ అనే యువకుడు తన స్నేహితులు ఎనిమిది మందితో కలిసి జలపాతానికి వచ్చాడు. జలపాతం వద్ద ఫోటోలు, సెల్ఫీలు దిగుతుండగా మహాన్వేష్ కాలుజారి నేరుగా జలపాతంలో పడిపోయాడు.
గట్టిగా కురిసిన వర్షాల కారణంగా జలపాతం వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అతడిని కాపాడే అవకాశం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న వెంటనే వాజేడు పోలీసులు, అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రిస్క్ రెస్క్యూ టీమ్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఇప్పటి వరకు యువకుడి శరీరం బయటపడలేదు.


