కాకతీయ, వరంగల్ బ్యూరో : వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రైసిటీ పరిధిలో భారీ ఎత్తున శోభాయాత్రలు నిర్వహించబడనున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్ తెలిపారు. ఈ ఆంక్షలు సెప్టెంబర్ 05 మధ్యాహ్నం 12 గంటల నుంచి సెప్టెంబర్ 07 ఉదయం 1 గంట వరకు కొనసాగనున్నాయి.
ముఖ్యంగా భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించాలని సూచించారు. ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, నర్సంపేట వైపుల నుంచి వచ్చే లారీలకు ప్రత్యేక రూట్లు కేటాయించారు. అలాగే బస్సుల రాకపోకలకు కూడా మార్పులు చేశారు. ములుగు, పరకాల వైపు నుంచి వచ్చే బస్సులు పెద్దమ్మగడ్డ, అంబేద్కర్ సెంటర్, ఏషియన్ శ్రీదేవి మాల్ మీదుగా బస్టాండ్‌కు చేరుకోవాలని, హన్మకొండ బస్టాండ్ నుంచి బయలుదేరే బస్సులు గమ్యస్థానాలవారీగా ప్రత్యేక మార్గాల ద్వారా వెళ్లాలని పోలీసులు తెలిపారు.
వరంగల్, ఖాజీపేట మధ్య చిన్న వాహనాలకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు. వినాయక నిమజ్జన వాహనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సిద్ధేశ్వర గుండం, బంధం చెరువు, చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం పూర్తయ్యాక వాహనాలు నిర్దేశిత మార్గాల ద్వారా వెళ్లాలని స్పష్టం చేశారు. నిమజ్జనం రోజున శోభాయాత్ర మార్గాల్లో వాహనాలు నిలపరాదని, భక్తులు, ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ విజ్ఞప్తి చేశారు.


