కాకతీయ, నేషనల్ డెస్క్: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి చలాన్ విధించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణ ప్రజలకు మాత్రమే కాదు, పదవిలో ఉన్న ముఖ్యమంత్రికీ ట్రాఫిక్ రూల్స్ ఒకేలా వర్తిస్తాయి అన్న సంకేతం ఈ ఘటనతో వెలువడింది.
పూర్తి వివరాల ప్రకారం. . బెంగళూరులో సీఎం కారు గత కొన్ని నెలల్లో 7 సార్లు సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు రికార్డుల్లో ఉంది. ట్రాఫిక్ విభాగం సీసీ కెమెరాల ఆధారంగా ఈ ఉల్లంఘనలను గుర్తించింది. సాధారణంగా ఒకసారి సీటు బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తే రూ.500 జరిమానా ఉంటుంది. అయితే వరుసగా 7 సార్లు నిబంధనలు ఉల్లంఘించడంతో పెద్ద మొత్తంలో జరిమానా విధించారు.
ప్రస్తుతం కర్నాటకలో ట్రాఫిక్ చలాన్‌లపై 50 శాతం రాయితీ స్కీమ్ అమల్లో ఉంది. ఈ పథకం ప్రకారం సాధారణ పౌరులకే కాకుండా సీఎం వాహనానికి కూడా అదే విధంగా జరిమానా తగ్గించింది. దీంతో మొత్తం చలాన్‌పై 50శాతం డిస్కౌంట్ ఇచ్చి మిగతా మొత్తాన్ని చెల్లించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది.
ముఖ్యమంత్రే నిబంధనలు పాటించకపోతే సాధారణ ప్రజలు ఎలా పాటిస్తారని కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం “చట్టం ముందు అందరూ సమానమే, సీఎం అయినా జరిమానా తప్పించుకోలేకపోయారు” అంటూ ట్రాఫిక్ శాఖ చర్యలను ప్రశంసిస్తున్నారు.


