లారీ ఢీకొని ట్రాక్టర్ డ్రైవర్ మృతి.
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారింది. తాడ్వాయి సమీపంలో ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న చిటమట రాజు, విష్ణు అనే ఇద్దరిని వేగంగా వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ చిటమట రాజు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, తోటి డ్రైవర్ విష్ణు తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించారు. అకస్మాత్తుగా ఎదురుగా వచ్చిన లారీని తప్పించుకోలేక ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న తాడ్వాయి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.


