నేడు టీపీసీసీ కీలక భేటి
పొలిటికల్, అడ్వైజరీ కమిటీల హాజరు
మీనాక్షి అధ్యక్షతన హై లెవెల్ మీటింగ్
సీఎం సహా కీలక నేతలకు పిలుపు
బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలే ఎజెండా
కాకతీయ, తెలంగాణ బ్యూరో :టీపీసీసీ రాజకీయ వ్యవహారాలు, అడ్వైజరీ కమిటీల కీలక సమావేశాలు రెండూ శనివారం సాయంత్రం భేటీ కానున్నాయని సమాచారం. ఈ మేరకు గాంధీ భవన్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించనున్న ఈ సమావేశాలకు ఏఐసీసీ ఇన్‌చార్జ్ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ అధ్యక్షత వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర సభ్యులు పాల్గొననున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ భేటీ కీలక ఉద్దేశం తెలంగాణలో స్థానిక ఎన్నికల అంశం అని విశ్వసనీయ వర్గాల సమాచారం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం చూస్తుండగా.. బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్ న్యాయసలహా కోసం పంపడంతో అది కూడా పెండింగ్ లోనే ఉంది. అంతేగాక స్థానిక ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన గడువు సెప్టెంబరు 30 సమీపిస్తుండగా, ఎన్నికలపై ఏం చేయాలా అనే అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ భేటీకి ప్రాధన్యత ఏర్పడింది. ఎన్నికల కసరత్తుపై చర్చించడానికే ఈ సమావేశం నిర్వహిస్తున్నారని శ్రేణుల్లో ప్రచారంలో ఉంది. ఈ భేటీలో సభ్యుల మెజారిటీ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకొని, ఈనెల 25న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదించనున్నట్టు తెలుస్తోంది.


