బీఆర్ఎస్‌కు టఫ్ టైం
ఖమ్మంలో పార్టీని నిలబెట్టేది ఎవరు..?
మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..?
కారు దిగిపోతున్న కార్పోరేటర్లు.. కీలక నేతలు
ఖమ్మం కారు పార్టీలో రోజురోజుకు పెరుగుతున్న ఆందోళన
అతి త్వరలోనే కార్పోరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్..!
మంత్రి తుమ్మల ‘ఆపరేషన్ ఆకర్ష్’తో కాంగ్రెస్ దూకుడు
కేసీఆర్ మ్యాజిక్‌పైనే బీఆర్ఎస్ ముఖ్య నేతల ఆశలు
త్వరలోనే అధినేతతో జిల్లాలో సభకు ప్లాన్..!?
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకూ సంక్లిష్టంగా మారుతోంది. ఒకప్పుడు రాజకీయంగా అజేయంగా కనిపించిన పార్టీకి ఇప్పుడు నాయకత్వ స్పష్టత లేకపోవడం పెద్ద బలహీనతగా మారింది. మాజీ మంత్రి అజయ్ ముందుండి నడిపిస్తాడా..? లేక మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు మరికొంతమంది కీలక నేతలు బాధ్యతలు తీసుకుంటారా? అన్న ప్రశ్నలు ముఖ్య నేతల్లో ఉదయిస్తుండటం గమనార్హం. మరోవైపు సమీపిస్తున్న కార్పొరేషన్ ఎన్నికలు బీఆర్ఎస్‌కు అసలైన అగ్నిపరీక్షగా మారాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కీలక కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతుండటం బీఆర్ఎస్‌ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఇప్పటికే సుమారు ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరడం పార్టీకి ప్రతికూలంగా మారింది. మరికొందరు అధికార పార్టీతో టచ్‌లో ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల వేళ కీలక నేతల వలసలు కొనసాగుతుండటంతో బీఆర్ఎస్ శిబిరంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.

మంత్రి తుమ్మల పక్కా వ్యూహం
ఇదే సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం కార్పొరేషన్‌ను లక్ష్యంగా చేసుకుని పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ‘ఆపరేషన్ ఆకర్ష్’ పేరుతో బీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లు, నేతలను కాంగ్రెస్ వైపు తిప్పే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జనవరి మొదటి వారంలోనే పలువురు కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ బలాన్ని పెంచారు. మే 8, 2026తో పాలకవర్గ గడువు ముగియనుండటంతో, ముందస్తుగా ఎన్నికలకు వెళ్లి ప్రతిపక్షానికి సిద్ధమయ్యే సమయం ఇవ్వకుండా చేయాలన్నదే తుమ్మల వ్యూహంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఖమ్మం నగర అభివృద్ధిని ప్రధాన అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే నగరాభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించగా, జనవరి 2026లో మరో రూ.50 కోట్లు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు. మున్నేరు మీద కేబుల్ బ్రిడ్జి, ఖమ్మం కోట వద్ద రోప్‌వే, అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లి ఓటర్ల విశ్వాసం పొందాలన్నది కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తోంది. ‘బస్తీ బాట’ కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారాలపై దృష్టి సారిస్తున్నారు.
కేసీఆర్ సభపైనే బీఆర్ఎస్ ఆశలు
ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం అధినేత కేసీఆర్ మ్యాజిక్‌పైనే ఆశలు పెట్టుకుంది. రైతాంగ సమస్యలు, నీటి ప్రాజెక్టుల అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని పార్టీ అధినేత ప్రకటించినప్పటికి ఖమ్మం జిల్లా, నగర రాజకీయాలపై ఆ ప్రభావం.. ప్రజలను బీఆర్ ఎస్ వైపు చూసేందుకు ఏమేరకు దోహదం చేస్తాయన్న దానిపైనా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలోనే త్వరలోనే ఖమ్మం జిల్లాలో బీఆర్ ఎస్ పార్టీ భారీ సభ ఉంటుందని, ఇందులో అధినేత కేసీఆర్ పాల్గొంటారన్న చర్చ కూడా జరుగుతోంది. జనవరి 10న కేటీఆర్ ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో సమావేశమై మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు చేరువయ్యేందుకు ‘బస్తీ బాట’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశముండటంతో ఖమ్మం కార్పొరేషన్‌పై పట్టుబట్టడం బీఆర్ఎస్‌కు పరువు సవాల్‌గా మారింది. పార్టీ పుంజుకుంటుందా? లేక కాంగ్రెస్ వ్యూహాలు ఫలిస్తాయా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.


