రేపే పల్లెపోరు
తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం
ఉమ్మడి జిల్లాలో 555 జీపీలు.. 4952 వార్డులకు ఎన్నికలు
ఇప్పటికే 53 జీపీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం
ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్
మధ్యాహ్నం 2నుంచి కౌంటింగ్… సాయంత్రానికి ఫలితాలు
గ్రామాలకు చేరిన పోలింగ్ సిబ్బంది.. సామాగ్రి
ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు.. పోలీసులు
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్లు
కాకతీయ, వరంగల్ బ్యూరో: ఓరుగల్లులో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియడంతో గురువారం పల్లె పోరు జరగనుంది. ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో కలెక్టర్లు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వరంగల్, హనుమకొండ జనగామ జిల్లాల పరిధిలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ఎస్పీలు భద్రతపై దృష్టి పెట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేలా చూడాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సాయంత్రమే పోలింగ్ సామాగ్రితో సిబ్బంది ఆయా గ్రామాలకు చేరుకున్నారు. భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాల్లో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. మానుకోట జిల్లాలో భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ శబరీష్ సమీక్షించారు.

ఓటుకు రూ. 2వేలు.. ఇంటికో మందు బాటిల్
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రచారం మంగళవారం ముగియడంతో 11న ఎన్నిక జరగనుంది. వరంగల్ 6 జిల్లాల నుంచి మొదటి విడతలో 555 జీపీలు ఉండగా 53 చోట్ల ఏకగ్రీవాలు కావడంతో మిగతా 502 చోట్ల సర్పంచ్ కోసం పోటీ జరగనుంది. 1749 మంది సై అంటే సై అంటున్నారు. ఇక మొదటి విడతలో 4, 952 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. బరిలో 8676 మంది ఉన్నారు. 981 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల గుర్తులు లేకున్నా సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థి ఏ పార్టీ మద్దతుదారుడన్న విషయంలో క్లారిటీ ఉంది. దీంతో పార్టీల పెద్ద లీడర్లు దీనిని సవాల్‌గా తీసుకోవడంతో చాలా జీపీల్లో ప్రలోభాలు జోరుగా కొనసాగుతున్నాయి. మేజర్ గ్రామ పంచాయతీలు, జనరల్ కోట రిజర్వేషన్లు ఉన్నచోట్ల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఓటుకు నోటు ఫార్ములా అమలు చేస్తున్నారు. దీంతో ఇంటికో క్వార్టర్ సీసాతో పాటు డిమాండ్ మేరకు ఓటుకు రూ. 2 వేల నుంచి 5 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం
హనుమకొండ జిల్లాలో గురువారం జరగనున్న మొదటి విడత ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల అధికారి కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. బుధవారం హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కమలాపూర్‌లోని మోడల్ స్కూల్ లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది కేటాయింపు, పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా గ్రామ పంచాయతీల వారీగా రూట్స్ అలాట్ చేసి జోనల్ రూట్ ఆఫీసర్లు సమన్వయంతో ఎన్నికల సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు చేర్చాలని కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న పోలింగ్ సిబ్బందికి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రారంభమవుతుందని, అందుకు సిబ్బంది ఎన్నికల సంఘం నియమ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.




