కాకతీయ, నేషనల్ డెస్క్: మధ్యప్రదేశ్‌లో కొత్తగా టమోటా వైరస్ (Tomato Virus) చిన్నారుల్లో వేగంగా వ్యాపిస్తున్నది. ముఖ్యంగా 6 నుంచి 13 ఏళ్ల వయసున్న పిల్లల్లో ఈ వైరస్ ఎక్కువగా కనిపిస్తోంది. టమోటా వైరస్ సోకిన పిల్లల చేతులు, పాదాలు, అరికాళ్లు, మెడ కింద, నోటిలో ఎర్రటి దద్దుర్లు తలెత్తుతున్నాయి.
భోపాల్‌లో ఇది ఒకరి నుంచి మరొకరికి బాగా వ్యాపిస్తోంది అని ఆరోగ్య అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి వ్యక్తిగత శుభ్రత, చేతులు సరిగా కడగడం, వంటి చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరి హాస్పిటల్‌లో పరీక్ష చేయించుకోవడం అత్యంత అవసరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
డాక్టర్ రాజేశ్ టిక్కాస్ చెప్పినట్లు, HFMD సాధారణంగా తీవ్రమైన వ్యాధి కాదని, పెద్దగా ఆందోళన అవసరం లేదని, సాధారణంగా వారం నుంచి పది రోజుల్లో తగ్గిపోతుందన్నారు. ఈ వైరస్ ఎక్కువగా మలవిసర్జన తర్వాత చేతులు సరిగా కడకపోవడం, శుభ్రత పాటించకపోవడం వల్ల వ్యాప్తి చెందుతుంది.
వైరస్ సోకిన వ్యక్తి దగ్గరికి వెళ్లడం, తుమ్మడం, దగ్గు పీల్చడం వలన లేదా శరీర స్రావాలు (లాలాజలం వంటి) ద్వారా ఒకరికి మరొకరికి అంటుతుంది. వ్యాధి సోకిన 3 నుంచి 6 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. HFMDకి ప్రత్యేకమైన చికిత్స ఉండదు, అయితే గుండె, ఊపిరితిత్తులు లేదా ఇతర జన్యుపరమైన సమస్యలు ఉన్న పిల్లలకు అత్యంత జాగ్రత్తగా వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది.
పిల్లల తల్లిదండ్రులు , వయసున్న వారు వ్యక్తిగత శుభ్రత, చేతులు కడుక్కోవడం, పిల్లల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


