- జడివాన!
- నీట మునిగిన వరంగల్
- బుధవారం ఉదయం 8గంటలకు మొదలైన వాన
- ఒక్క నిముషం గెరువు ఇవ్వకుండా కుండపోత
- గోదారులైన జాతీయ రహదారులు..!
- ఈ రాత్రి గడిస్తే చాలనుకుంటున్న లోతట్టు ప్రాంతాలవాసులు
కాకతీయ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి.మొంథా తుఫాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి మొదలైన వర్షాలు.. బుధవారం రోజంతా కొనసాగింది. కనీసం ఒక్క నిముషం కూడా తెరిపివ్వకుండా వాన దంచికొట్టింది. దీంతో హన్మకొండ, వరంగల్ పట్టణాల్లోని వందలాది కాలనీలు నీట మునిగాయి. హన్మకొండలోని వడ్డెపల్లి, టీచర్స్ కాలనీ, బ్యాంకు కాలనీ, హన్మకొండ చౌరస్తా, వికాస్‌నగర్, రెవెన్యూ కాలనీ, ఎక్సైజ్ కాలనీ, హంటర్ రోడ్డు, న్యూశాయంపేట, డబ్బాల్ ఏరియా, యాదవనగర్, సమ్మయ్యనగర్, గోపాల్‌పూర్, భీమారం, వరంగల్ పట్టణంలోని ఉర్సుగుట్ట, కరీమాబాద్, శివనగర్, అండర్ బ్రిడ్జీ ఏరియా, మండిబజార్, ఎంజీఎం సెంటర్, ములుగు రోడ్డు, కాశిబుగ్గ, లేబర్ కాలనీ, ఇలా దాదాపు త్రినగరి మొత్తం జలమయం అయ్యింది.
వరంగల్‌లో జడివాన
జడివాన..!



భారీ వర్షం ఉమ్మడి వరంగల్ జిల్లాను ముంచెత్తింది. మునుపెన్నడూ లేని రీతిలో బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షంతో జిల్లా అతలాకుతలమైంది. వాగులు, ఒర్రెలు వరద నీటితో పొంగి ప్రవహించాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈదురుగాలి, కోతకు గురై భారీ వృక్షాలు సైతం కూలిపోయాయి. చెరువులన్నీ నీటితో నిండి అలుగు పోస్తున్నాయి. లోతట్టు ప్రాంత కాలనీల్లోకి వరద నీరు చేరింది. బుంగలు పడిన కొన్ని చెరువుల కట్టలకు అధికారులు ఇసుక బస్తాలు వేశారు. గ్రామాలు, పట్టణాల్లో కొన్ని ఇండ్లు పూర్తిగా, మరికొన్ని ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కరెంటు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు పడిపోవడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. పలు గ్రామాలు, పట్టణాల్లోని కాలనీలకు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. వరంగల్ జిల్లా నెక్కొండలో 24.63 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదవగా, ఆ తర్వాతి స్థానాల్లో పర్వతగిరి (23.48 సెం.మీ.), రెడ్లవాడ (18.3 సెం.మీ.), కల్లెడ (15.9 సెం.మీ.) ఉన్నాయి. వీటితోపాటు, వరంగల్ మరియు హన్మకొండ పట్టణాలలో కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, రోడ్లపై వరద నీరు చేరింది. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రయాణికులకు ఆహార పానీయాలు అందించాయి. అదనంగా వరంగల్లోని ఎన్‌టీఆర్ కాలనీ, సంతోషిమాత కాలనీ, సాయి నగర్ కాలనీ వంటి ప్రాంతాల నుండి బాధితులను రక్షించడానికి సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి.
నిలిచిన రైళ్లు..


మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ప్రధాన రైల్వే మార్గాలు, స్టేషన్లు జలమయమయ్యాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల ధాటికి డోర్నకల్ రైల్వే జంక్షన్ వద్ద రైల్వే ట్రాక్‌లు పూర్తిగా నీట మునిగాయి. సుమారు 5 గంటల పాటు కురిసిన వర్షానికి వరద నీరు రైల్వే స్టేషన్‌లోకి భారీగా చేరింది. డోర్నకల్ జంక్షన్‌లో ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపైకి కూడా నీరు చేరింది. రైల్వే ట్రాక్‌లు నీటిలో మునిగిపోవడంతో, ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా పలు రైళ్లను జిల్లా పరిధిలోనే నిలిపివేశారు. గోల్కొండ ఎక్స్‌ప్రెస్, ఒక గూడ్స్ రైలును డోర్నకల్ జంక్షన్‌లో నిలిపివేశారు. గోల్కొండ రైలులో 220 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. గుండ్రాతి మడుగు వద్ద కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను సైతం నిలిపివేశారు. మహబూబాబాద్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేయగా, గార్ల సమీపంలో మరో గూడ్స్ రైలును నిలిపివేశారు. విజయవాడ నుంచి వస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా ఖమ్మం జిల్లా పరిధిలోనే నిలిపివేశారు.


