జోలెలోనే దవాఖానకు..
వలస కూలీల కష్టాలు
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా (నూగురు) వెంకటాపురం మండలం పరిధిలో వలస కూలీల దుస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది. పని కోసం ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన ఓ వలస కూలీ తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యాడు. సహచర కూలీలు అతడిని సుమారు రెండు కిలోమీటర్ల మేర ఒక కర్రకు జోలకట్టి మోస్తూ మండలకేంద్రంలోని బస్ స్టేషన్ వద్దకు తీసుకొచ్చారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్సు సర్వీస్ కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకుని బాధితుడిని పక్కనే ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. వలస కూలీలకు తగిన వసతులు, వైద్య సదుపాయాలు లేక ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో పని చేసే వలస కార్మికుల ఆరోగ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.


