శవాన్ని తీసుకెళ్లాలంటే
అంబులెన్స్‌ను తోయాల్సిందే!
ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్ దుస్థితి
స్టార్ట్ కాక మొరాయించిన వాహనం…
చివరికి ప్రైవేట్ అంబులెన్స్ ఆశ్రయం
సిరిసిల్లలో హృదయవిదారక ఘటన
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.ఆప్తుడిని కోల్పోయిన కుటుంబం కన్నీళ్లలో మునిగిపోతుండగానే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాల్సిన ప్రభుత్వ అంబులెన్స్ మొరాయించడం కలచివేసింది.రెండు రోజుల క్రితం ఎల్లారెడ్డిపేట మండలం బొప్పపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కూలి పనులు ముగించుకొని ఆటోలో వెళ్తుండగా వాహనం బోల్తా పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం అతను మృతిచెందాడు.అనంతరం మృతదేహాన్ని తరలించేందుకు ఆసుపత్రి అంబులెన్స్‌ను పిలిపించారు. అంబులెన్స్ అక్కడికి చేరుకున్నప్పటికీ స్టార్ట్ కాకపోవడంతో పరిస్థితి మరింత విషాదకరంగా మారింది. డ్రైవర్ “స్టార్ట్ కావడం లేదు… కొంచెం తోయండి” అని చెప్పడంతో అప్పటికే దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులే అంబులెన్స్‌ను తోయాల్సిన దురవస్థ ఏర్పడింది. కన్నీళ్లు మున్నీళ్లుగా వాహనాన్ని తోసినా అది స్టార్ట్ అవలేదు.ఒకవైపు మృతదేహం… మరోవైపు మొరాయించిన అంబులెన్స్ ఈ దృశ్యం అక్కడున్న వారిని కదిలించింది.

చివరకు చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు ప్రైవేట్ అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాల్సి వచ్చింది.అత్యవసర సమయంలో అందాల్సిన అంబులెన్స్ సేవలు అవసరమైన వేళ విఫలమవడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.“జీవితంలో చివరి ప్రయాణం కూడా ఇంత కష్టమా…? అంబులెన్స్ కోసం ఎదురుచూస్తే మనుషులే తోసుకోవాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం” అంటూ అక్కడున్నవారు ఆవేదన వ్యక్తం చేశారు.అధికారుల నిర్లక్ష్యంతో అంబులెన్స్ సేవలు నామమాత్రంగా మారాయని స్థానికులు విమర్శించారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకుని ప్రత్యామ్నాయ వాహనాలను అందుబాటులో ఉంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


