ఆన్‌డ్యూటీ పేరుతో అనువైన చోట్లకు
అక్రమంగా ఇంటర్మీడియట్ బోర్డులో ఉద్యోగుల బదిలీలు
ఐదేళ్ల సర్వీసు నిబంధనలకు మంగళం
ఏదో వంక చూపుతూ పాత స్థానాలకు చేరుకుంటున్న వైనం
ఆన్‌డ్యూటీ బదిలీలల వెనుక అంతా మనీ మ్యాటరేనంట
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఇంటర్మీడియట్ బోర్డు రూటే సపరేటు అన్నట్లుగా మారింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెగ్యులరైజ్డ్ అధ్యాపకుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్లతో, మరోవైపు ఆన్ డ్యూటీలతో అధ్యాపకులను, బోర్డ్ అధికారులు అటు, ఇటు చక్రంలా తిప్పుతున్నారు. కాలేజీలలో పాఠాలు బోధించేవారూ లేక విద్యార్థుల చదువులు అటకెక్కాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5 సంవత్సరాలు ఓకే చోట పనిచేసే ఉద్యోగులను సాధారణ బదిలీలను చేపట్టడం జరుగుతుంది. అదే సమయంలో ప్రత్యేక అవసరాలు.. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు ఆన్ డ్యూటీలు ఇవ్వడం జరుగుతుంది.
ఆన్ డ్యూటీ బదిలీల్లో లీలలు..!
ఆన్ డ్యూటీ బదిలీల మాటున ఇంటర్మీడియట్ విద్యా విభాగంలో పనిచేస్తున్న కొంతమంది టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు ఒకే చోట తిష్ట వేసే ప్రక్రియ జరుగుతోంది. ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలోని కళాశాలలు, విభాగాల్లో 2023లో మెడికల్, స్పౌజ్, ప్రత్యేక పరిస్థితుల కారణాలతో ఆన్ డ్యూటీ లతో బదిలీ అయిన వారు, 2024 ఆగస్టు లో సాధారణ బదిలీలల్లో బదిలీ అయినవారు కనీసం 2 సంవత్సరాల సర్వీసు పూర్తయిందో లేదో అంతకు ముందు పనిచేసిన స్థానాల్లోకి ఆన్ డ్యూటీ పేరుతో మారిపోతుండటం గమనార్హం. 2025 సం.లో మళ్ళీ అవే పాత మెడికల్, స్పౌజ్, ప్రత్యేక పరిస్థితుల కారణాలుగా పేర్కొంటూ వ్యక్తిగత అవసరాల కోసం మరికొందరు, వారికి అనుకూలంగా ఉన్న కాలేజీలకు, తమ పలుకుబడిని ఉపయోగించి ఆన్ డ్యూటీల పేరుతో పాత స్థానాలకు చేరుకుంటున్నారు.
అంతా మనీ మ్యాటర్.. అందుకే అధికారుల సహకారం..!
ఆన్ డ్యూటీ మాటున ప్రభుత్వ సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల బదిలీల్లో పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతున్నట్లుగా తెలుస్తోంది. కేవలం 2 సంవత్సరాల సర్వీసు లోనే వారికి పని చేస్తున్న చోటునుంచి, వారు ఎంచుకున్న మరో చోటుకి అధికారులు బదిలీలు చేపట్టడం వెనక మనీ మ్యాటర్ నడుస్తున్నట్లుగా ఉద్యోగవర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రతి విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, 5 సంవత్సరాలు ఒకే స్థానంలో పనిచేయాల్సిన ప్రభుత్వ నిబంధనలు, ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు వర్తించవన్నట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఇప్పటికైనా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, అధికారులు స్పందించి, ఇంటర్ బోర్డు పరిధిలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల నిబంధనలకి విరుద్ధంగా జరుగుతున్న అక్రమ ఆన్ డ్యూటీ బదిలీలను వెంటనే నిలిపివేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.


