ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజల్లో ఉండాలి
బిజెపి మండల ఇంచార్జి నరహరి లక్ష్మారెడ్డి పిలుపు
కాకతీయ, కరీంనగర్ : ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా అభ్యర్థులు నిరంతరం ప్రజాసేవలో నిమగ్నం కావాలని బిజెపి మండల ఎన్నికల ఇంచార్జి నరహరి లక్ష్మారెడ్డి సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని కొత్తపల్లిలో బిజెపి మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. ఓటమి పాలైన అభ్యర్థులకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కేంద్ర నిధులతోనే గ్రామాభివృద్ధి
గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ నిధులే ప్రధాన ఆధారమని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో గ్రామాలకు మరిన్ని నిధులు తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో బూత్ స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసి, ప్రజల మద్దతు కూడగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రజాప్రతినిధులకు సన్మానం
అనంతరం రాంహన్మాన్ నగర్ సర్పంచ్ పిస్క సౌజన్య కిషోర్, ఉపసర్పంచ్ అందె శేఖర్, వార్డు సభ్యులు ఉప్పులేటి ప్రవీణ్, గుంటుక లత, వీణవంక అంజి, మారం శివాణి తదితరులను మండల పార్టీ పక్షాన శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బూట్ల శ్రీనివాస్, మండల కార్యదర్శులు కిన్నెర అనిల్, గొట్టిముక్కల తిరుపతి రెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్, కిసాన్ మోర్చా నాయకులు వేల్పుల రవీందర్, కొయ్యడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


