- మధిర నియోజకవర్గం మహిళా డైయిరీ నా చిరకాల వాంఛ
- పథకం అమలుతో పదేళ్ల నా కల నెరవేరింది
- పాల ఉత్పత్తులతో ఏటా రూ.1000 కోట్లు సంపాదించేలా చర్యలు
- త్వరలో బోనకల్లులో ఇందిరా మహిళ డైయిరీ పరిశ్రమ
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాకతీయ, తెలంగాణ బ్యూరో : పాల ఉత్పత్తుల ద్వారా మధిర నియోజకవర్గం మహిళా సంఘాల సభ్యులు భారత దేశానికి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఇందిరా మహిళ డైయిరీ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరా మహిళా డైయి రీ తన చిరకాల వాంఛ అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013 సంవత్సరంలో మధిర నియోజకవర్గంలోని 52,000 మహిళా సంఘాల సభ్యులకు రెండు గేదలు కొని వ్వాలని ఆరోజు భావించానన్నారు. అయితే అదే సమయంలో రాష్ట్ర విభజన జరగడం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పదేళ్లపాటు ఈ పథకాన్ని పట్టించుకోకపోవడంతో అమలు చేయలేకపోయామన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే మధిర నియోజకవర్గం లో మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో పాటు వారు సమాజంలో పోటీపడి బతకాలని ఈ పథకాన్ని అమలులోకి తీసుకురావడంతో తన చిరకాల వాంఛ నెరవేరింది అన్నారు.
ప్రతీ మహిళకు రెండు గేదెలు..!
ప్రజా ప్రభుత్వంలో ప్రతి మహిళకు రెండు గేదెలను ఇవ్వడంతో పాటు వాటిని కాపాడడానికి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గేదెలు ఉండటం కోసం కొట్టాలు మంజూరు చేయడంతో పాటు, సోలార్ ను కూడా మంజూరు చేస్తామన్నారు. రోజువారి కూలీలకు పనులకు వెళ్లే మహిళలు తాము గేదెలు తీసుకుంటే వాటిని ఎవరు చూస్తారు గడ్డి ఎవరు వేస్తారు, దాన ఎవరు వేస్తారు అన్న భావన ఉండవచ్చని, అయితే అందుకోసం మీరు కూలి పనులకు వెళ్లినప్పటికిని గేదెలకు దానా గడ్డి సరఫరా చేయడం కోసం నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడం జరుగుతుందని, వారే వచ్చి సరఫరా చేసేలా ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం ఉపాధి కల్పిస్తున్న యువతకు ట్రాలీ ఆటోలు కూడా ఇప్పిస్తామన్నారు. ప్రతి మండలాన్ని మూడు భాగాలుగా విభజించి, ప్రతి 10 గ్రామాలను యూనిట్గా ఏర్పాటు చేసి పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు.
భూమి లేకున్నా కూడా గేదెల మంజూరు
భూమి లేకున్నా కూడా గేదెలను మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భూమి ఉన్న నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించేలా వారి పొలాలలో గడ్డిని పెంచిపించి గడ్డిని కూడా సరఫరా చేస్తామన్నారు. ప్రతి నెల గేదెలను వాటి ఆరోగ్యాన్ని పరీక్షించడం కోసం డాక్టర్లు వస్తారని అంబులెన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. డాక్టర్లు గేదెల ఆరోగ్యాన్ని పరీక్షించడంతోపాటు గేద ఆరోగ్యం ఎలా ఉంది అనే రిపోర్టు కూడా రూపొందిస్తారని ఎన్ని లీటర్ల పాలు ఇస్తున్నాయని గుర్తిస్తారన్నారు. అదేవిధంగా ప్రతి గేదెకు సంబంధించి హెల్త్ కార్డును అందజేస్తామన్నారు. ప్రతి లబ్ధిదారుడు పాల ఉత్పంతులు పెంచేలా చూడాలని కనీసం 10 లీటర్లకు పైగా రోజు విక్రయించుకునేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. బోనకల్లు మండలంలోని ఇందిరా మహిళా శక్తి పాల పరిశ్రమను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ పరిశ్రమను అమూల్, విజయ డైరీ, హెరిటేజ్ పరిశ్రమల మాదిరిగా బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఇక్కడి పాల ఉత్పత్తులు దేశవ్యాప్తంగా అమ్మేలా ఏర్పాటు చేస్తామని అన్నారు. పాల ఉత్పత్తులను పెంచడం ద్వారా మదిర నియోజకవర్గ మహిళలు 1000 కోట్లు సంపాదించేలా చర్యలు తీసుకుంటామని ఈ విధంగా 5 ఏళ్లలో 5000 కోట్లు సంపాదించాలని ఆకాంక్షించారు. ఇందుకు రాష్ట్రంలోనే మధిర నియోజకవర్గం లో ప్రాథమిక పునాది పడిందని అన్నారు. ఈ ఏడాది 20 వేల మంది మహిళలకు గేదలను పంపిణీ చేస్తామని వచ్చే ఏడాది మరో 20 వేల మందికి, ఆ తర్వాత మిగిలిన 20వేల మందికి గేదెలను పంపిణీ చేస్తామన్నారు.


