రైతులకు సకాలంలో సాగునీరు
ప్రాజెక్టుల నుంచి సాగు నీటి విడుదల
మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి
అన్నపూర్ణ, మిడ్ మానేరు గేట్లు ఎత్తిన ఎమ్మెల్యే
కాకతీయ, కరీంనగర్ : బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల్లో సాగులో ఉన్న పంటలు దెబ్బతినకుండా రైతులకు సకాలంలో సాగునీరు అందిస్తున్నామని మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. శనివారం ఇల్లంతకుంట మండలం అంతగిరి వద్ద ఉన్న అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి, అలాగే కందికట్కూర్–వల్లంపట్ల గ్రామాల మధ్య ఉన్న మిడ్ మానేరు జలాశయం నుంచి కాలువల ద్వారా సాగునీటి విడుదలకు ఆయన గేట్లు ఎత్తివేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల సుమారు 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. అదే విధంగా మిడ్ మానేరు నుంచి విడుదల చేసిన మరో 100 క్యూసెక్కుల నీటితో బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల రైతులకు గణనీయమైన లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. ముందుగానే నీటి విడుదల జరగడం వల్ల వరినాట్లు వేసుకున్న రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
మిడ్ మానేరు నుంచి విడుదలైన నీరు గన్నేరువరం, ఇల్లంతకుంట మండలాల మీదుగా గౌరవెల్లి వరకు ప్రవహిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ఆయకట్టు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు భూసేకరణ అవసరమని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెల్లడించారు. అంతేగాక అంతగిరి (అన్నపూర్ణ ప్రాజెక్టు)ను రానున్న రోజుల్లో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చేలా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్సారెస్పీ ఎస్సీ, ఈఈ, డీఈలతో పాటు ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు ఊట్కూరి వెంకటరమణారెడ్డి, గుడిసె అయిలయ్య, సింగిల్ విండో మాజీ చైర్మన్ ఐరెడ్డి మహేందర్‌రెడ్డి, పార్టీ నాయకులు పసుల వెంకటి, నవీన్, గూడ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


