పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
కరీంనగర్ సీపీ గౌష్ ఆలం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. ఎన్నికల బందోబస్తుపై పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన వివరాలు వెల్లడించారు.ఈ దశలో వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్, వి.సైదాపూర్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 111 గ్రామ పంచాయతీలు, 1034 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.ప్రతి మండలానికి ఒక ఏసీపీని నియమించగా, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో అదనంగా ఏసీపీలను కేటాయించారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో అదనపు బలగాలు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు.ప్రతి పోలింగ్ కేంద్రంలో స్టాటిక్ పోలీస్ పార్టీతో పాటు, రూట్ మొబైల్ పార్టీలు విధులు నిర్వహిస్తాయి. ప్రతి మండలానికి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, పూర్తి రైట్ గేర్‌తో స్పెషల్ యాక్షన్ టీమ్ పోలీసులు సిద్ధంగా ఉంటారని సీపీ తెలిపారు.పోలింగ్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ప్రచారం, గుంపులు, పార్టీ చిహ్నాలు నిషేధం కాగా, పోలింగ్ స్టేషన్లలో మొబైల్ ఫోన్లకు అనుమతి లేదన్నారు.భద్రత కోసం మొత్తం 877 మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, స్పెషల్ యాక్షన్ టీమ్, హోంగార్డ్స్, బెటాలియన్ పోలీసులు ఉన్నారు.శాంతిభద్రతల దృష్ట్యా బి ఎన్ ఎస్ ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని సీపీ గౌష్ ఆలం విజ్ఞప్తి చేశారు.


