మేడారం జాతరకు పటిష్ట బందోబస్తు
లక్షలాది భక్తుల రాక దృష్ట్యా సమగ్ర భద్రత
ట్రాఫిక్ జామ్‌లకు తావు లేకుండా ముందస్తు చర్యలు
అభివృద్ధి పనులు గడువులోపు పూర్తి చేయాలి
గత అనుభవం ఉన్న అధికారులకే కీలక బాధ్యతలు
పోలీసు అధికారులకు మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాలు
కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరుగాంచిన మేడారం జాతర–2026ను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణపై పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మేడారం ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. పనులు నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేసి, నిర్ణీత గడువులోపు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. తదనంతరం నిర్వహించిన ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో ఐజీ మాట్లాడుతూ.. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం మహా జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు, భద్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని తేల్చి చెప్పారు. గత జాతరలో అనుభవం ఉన్న అధికారులను ఆయా జోన్‌లు, సెక్టార్లలోనే విధులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అవసరమైన స్థాయిలో పోలీస్ సిబ్బందిని ప్రణాళికాబద్ధంగా వినియోగించి ప్రజా భద్రతను నిర్ధారించాలని ఆదేశించారు.
ట్రాఫిక్ నియంత్రణే కీలకం
జాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ అత్యంత కీలకమని ఐజీ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వాహనాల దారి మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లపై ముందుగానే సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. భక్తులు ఎంతో దూరం నుంచి వచ్చి దర్శనం చేసుకునే దృష్ట్యా, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో రామగుండం సీపీ అంబర్ కిషోర్ జా ఐపీఎస్, వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్, కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఐపీఎస్, మహబూబాబాద్ ఎస్పీ డా. శబరిష్ పి ఐపీఎస్, భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్ ఐపీఎస్, రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ గీతే బాబాసాహెబ్ ఐపీఎస్‌తో పాటు అదనపు ఎస్పీలు, ఏఎస్పీలు, డీఎస్పీలు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


