కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనోత్సవ శోభాయాత్రను శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్లలో మొత్తం 2100 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తించనున్నారు.
వీరిలో నలుగురు డీసీలు, ఇద్దరు అదనపు డీసీలు, 15 మంది ఏసీపీలు, 53 మంది ఇన్‌స్పెక్టర్లు, 70 మంది ఎస్‌ఐలతో పాటు కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఉన్నారు. ట్రై సిటీ పరిధిలోనే 1600 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేయగా, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారని తెలిపారు.
ట్రాఫిక్ అంతరాయం రాకుండా రేపటి నుండి మళ్లింపులు అమల్లోకి వస్తాయని, ప్రధాన జంక్షన్ల వద్ద అదనపు ట్రాఫిక్ సిబ్బందిని నియమించినట్టు వెల్లడించారు.
ప్రజలకు, నిర్వాహకులకు సీపీ సూచనలు..నిర్వాహకులు డీజేలు పూర్తిగా నిషేధం అని, ఆడియో సిస్టమ్స్ నిర్ణీత స్థాయిలో వినియోగించాలి, బాణాసంచా కాల్చరాదు అని తెలిపారు.
వాహనాలను ప్రార్థన మందిరాల వద్ద నిలపరాదు. విద్యుత్ తీగలు గమనిస్తూ శోభాయాత్ర కొనసాగించాలి, నిమజ్జనం ప్రదేశాలకు చిన్నపిల్లలను తీసుకురావొద్దు, మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనరాదని అన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఎటువంటి పుకార్లను నమ్మరాదు, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 ద్వారా పోలీసులను సంప్రదించాలని సీపీ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు.


