చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు
ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్
సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాట్ల పరిశీలన
కాకతీయ, సిరిసిల్ల టౌన్: రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు.ఈనెల 16వ తేదీన సోమవారం సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం చేస్తున్న ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ముందుగా సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్యాలయాల్లో కౌన్సిల్ సమావేశ మందిరంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. నిబంధనల ప్రకారం కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం.. అనంతరం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఇంచార్జ్ కలెక్టర్ తో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, అధికారులు శ్రీనివాసాచారి, అన్సార్ తదితరులు ఉన్నారు.


