ఐనవోలు జాతరకు పటిష్ట ఏర్పాట్లు
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు
శాఖల సమన్వయంతో ప్రశాంతంగా జాతర నిర్వహించాలి
వైద్యం, విద్యుత్, రవాణా, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశాలు
కాకతీయ, హనుమకొండ : ఐనవోలు శ్రీ మల్లికార్జునస్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే జాతర ఏర్పాట్లపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

విద్యుత్, తాగునీరు, పారిశుధ్యానికి ప్రాధాన్యం
జాతర సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించాలని, ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటల విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. బస్టాండ్, జాతర ప్రాంగణంలో తాగునీటి సౌకర్యాలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ అత్యంత కీలకమని పేర్కొంటూ అవసరమైతే పక్క గ్రామాల సిబ్బందిని కూడా వినియోగించాలని సూచించారు. మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేసి మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని చెప్పారు.
వైద్య సదుపాయాలు, అత్యవసర సేవలు
భక్తుల ఆరోగ్య పరిరక్షణకు జాతర ప్రాంగణంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, 108 అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా స్వచ్ఛందంగా సేవలందించేలా వైద్య ఆరోగ్యశాఖ చొరవ తీసుకోవాలని సూచించారు. పారిశుధ్య సిబ్బందికి మాస్కులు, భోజనం, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.
రవాణా, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ
జాతరకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలని, కొమురవెల్లి, మేడారం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సరైన పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, మహిళా భక్తుల భద్రత కోసం మహిళా పోలీసులను నియమించాలని మంత్రి సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అనుమానితులు, దొంగతనాలు జరగకుండా నిఘా పెంచాలని చెప్పారు. అక్రమ మద్యం అమ్మకాలను కట్టడి చేయాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు.
సమన్వయంతో విజయవంతం చేయాలి
జాతర ఏర్పాట్లలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, విధుల్లో ఉన్న అధికారుల పనితీరును పర్యవేక్షించి ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. సమావేశం అనంతరం జాతర, పర్యాటక శాఖ పోస్టర్లను మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కలిసి ఆవిష్కరించారు.



