కరీంనగర్ శివారులో పులి సంచారం గ్రామాల్లో భయాందోళన
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ మండలం బహదూర్ఖాన్‌పేట్, వెదురుగట్ట గ్రామాల శివారు ప్రాంతాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. బహదూర్ఖాన్‌పేట్ శివారులో రైతు తన పొలంలో పెద్ద అడుగుజాడలు గుర్తించి పోలీసులకు, అటవీశాఖకు సమాచారం అందించాడు.ఘటనాస్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పరిశీలన చేసి అవి పులి అడుగుజాడలేనని నిర్ధారించారు. ఇదే ప్రాంతంలోని ఓ మామిడి తోటలో కూడా పులి అడుగుజాడలు కనిపించినట్లు అధికారులు తెలిపారు.
పులి సంచారం ఉండవచ్చని అంచనా వేస్తున్న నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సూచించింది. రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాలు, అటవీ ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరించింది.కరీంనగర్ నగరానికి సమీప గ్రామాల్లోనే పులి సంచారం కొనసాగుతుండటంతో జిల్లా వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. పులి కదలికలపై నిఘా కొనసాగిస్తున్నామని, గస్తీ పెంచామని అటవీశాఖ అధికారులు తెలిపారు.



