రాజధానిలో టిఫిన్లకు బ్రేక్
గ్యాస్ కొరతతో దోశ, పూరి, వడ తాత్కాలికంగా బంద్
మూతపడుతున్న చిన్న హోటళ్లు
యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరాలో అంతరాయం
కాకతీయ, హైదరాబాద్ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం హైదరాబాద్ నగరంపై కూడా పడుతోంది. గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో నగరంలోని అనేక హోటళ్లు, హాస్టళ్లు, మెస్‌లు తమ మెనూలో మార్పులు చేసుకుంటున్నాయి. వండేందుకు ఎక్కువ గ్యాస్, నూనె అవసరమయ్యే దోశ, పూరి, వడ వంటి వంటకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ఐటీ కారిడార్ హోటళ్ల అసోసియేషన్ ప్రకటించింది. గ్యాస్ కొరత తీవ్రంగా ఉండడంతో చిన్న హోటళ్లపై ప్రభావం ఎక్కువగా పడుతోంది. రోజువారీ వ్యాపారం మీద ఆధారపడే చిన్న హోటళ్లు కొన్నిచోట్ల తాత్కాలికంగా మూతపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
మెనూ కుదింపు.. ధరల పెంపు
గ్యాస్ కొరత కారణంగా ఎక్కువ సమయం పట్టే వంటకాలను తగ్గిస్తూ చాలా చోట్ల సరళమైన మెనూనే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అన్నం, సాంబార్, పప్పు, రసం వంటి వంటకాలను మాత్రమే వడ్డిస్తున్నట్లు పీజీ హాస్టళ్లు, మెస్ నిర్వాహకులు తెలిపారు. టీ, కాఫీ, చపాతీ, దోశ, పూరి వంటి వంటకాలను కూడా తాత్కాలికంగా నిలిపివేసిన చోట్ల ఉన్నాయి. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే హాస్టళ్లు, మెస్‌లు కూడా పూర్తిగా మూసివేయాల్సి వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు రవాణా ఖర్చులు పెరగడంతో కొన్ని పెద్ద హోటళ్లు టిఫిన్ ధరలను కూడా పెంచాయి. దోశ, పూరి, వడలపై కనీసం 15 రూపాయలు, ఇడ్లీ, ఉప్మా వంటి వంటకాలపై కనీసం 10 రూపాయల వరకు ధరలు పెంచినట్లు సమాచారం. గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వస్తేనే పరిస్థితి మళ్లీ సవ్యంగా మారే అవకాశముందని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.


