సీనియర్లకే టికెట్లివ్వాలి
ముస్లిం మెజారిటీ డివిజన్లలో ప్రాధాన్యం ఇవ్వాలి
జిల్లా కాంగ్రెస్ మైనారిటీ నేతల సమావేశంలో డిమాండ్
కాకతీయ, కరీంనగర్ : రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముస్లిం మెజారిటీ ఓటర్లు ఉన్న డివిజన్లు అలాగే సుమారు 30 శాతం ముస్లిం జనాభా ఉన్న డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ టికెట్లను సీనియర్ నేతలకు కేటాయించాలని జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దిన్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టకాలంలో పని చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మొహమ్మద్ తాజోద్దిన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేసినవారు, పార్టీ కోసం నిరంతరం సేవలందించిన సీనియర్ మైనారిటీ నాయకులకు ఈసారి అవకాశం కల్పించాలని కోరారు. అలా చేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు నేహాల్ అహ్మద్, లయీఖ్ ఖాద్రీ, అబ్ధుల్ రహ్మాన్, అహ్మద్ ఆలీ, మోసిన్, ఎండీ కలిముద్దీన్, సయ్యద్ ఖమరోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


