క్యాతన్‌పల్లి హస్తం పార్టీలో టికెట్ల కుంపటి
టికెట్లు అమ్ముకుంటున్నారంటూ మంత్రి ఎదుటే వాగ్వాదం
జెండా మోసిన నాయకులకు అన్యాయమంటూ ఆశావహుల ఆరోపణలు
రసాబాసగా మారిన మంత్రుల సమావేశం..! ఐదు నిముషాల్లో మీటింగ్ క్లోజ్
మంత్రి వివేక్ ఇలాఖాలో మునిసిపల్ ఎన్నికల వేఢీ
కాంగ్రెస్‌లో పెరుగుతున్న అసమ్మతి నేతలు
కాకతీయ, రామకృష్ణాపూర్ : పట్టణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు రోజురోజుకూ మరింత ముదురుతున్నాయి. ఆశావహుల ఆశలను ఆవిరి చేస్తూ కొందరు నేతలు వివాదాలకు తెరలేపుతున్నారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. హస్తం పార్టీలో టికెట్ల కుంపటి నేతల మధ్య తీవ్ర విభేదాలకు కారణమవుతోందని పార్టీ వర్గాలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నాయి. మున్సిపాలిటీలో వార్డుల వారిగా వెలువడిన రిజర్వేషన్లు ఒకవైపు ఉండగా, టికెట్ల కేటాయింపు మరో పెద్ద ఘట్టంగా మారింది. క్యాతన్ పల్లిలోని ఇరవై రెండు వార్డుల్లో ఎవరెవరికి టికెట్లు దక్కనున్నాయన్న అంశమే ఇప్పుడు ప్రతి నోట వినిపిస్తోంది. ఈ టికెట్ల కోసమే మంత్రుల సమావేశ మందిరంలోనే నేతలు ఒకరికొకరు సూటిగా ప్రశ్నించుకోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

మంత్రుల ముందే మాటల యుద్ధం..!
టికెట్ల వ్యవహారంపై పార్టీలోని నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకోవడంతో మంత్రుల సమావేశాన్ని ఐదు నిమిషాల్లోనే ముగించాల్సి వచ్చింది. ఎన్నికల వేళ సొంత పార్టీలోనే తలెత్తిన ఈ వివాదం పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ నేతల మధ్య జరిగిన ఈ సంఘటనపై “కాకతీయ” ప్రత్యేక కథనం అందిస్తోంది. సోమవారం స్థానిక బీమా గార్డెన్లో ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సమక్షంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ నాయకుల మధ్య తీవ్ర కలహాలు చోటుచేసుకున్నాయి. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డ వారికి కాకుండా కొత్త వారికి టికెట్లు అమ్ముకుంటున్నారని సీనియర్ నాయకుడు పుల్లూరి కల్యాణ్ ఆరోపించారు. తమకు నచ్చిన వారి పేర్లను అర్హుల జాబితాలో చేర్చి, పార్టీ కోసం కష్టపడ్డ వారి పేర్లను ఎందుకు పక్కన పెడుతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు.
గుర్తింపు లేదు… గౌరవం లేదు.!!
పార్టీ కోసం పనిచేసిన వారికి సరైన గుర్తింపు, గౌరవం, టికెట్లు దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వార్డుల్లో కార్యక్రమాలు నిర్వహించింది తానే అయినా, టికెట్లు మాత్రం ఇతరులకు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం మంత్రులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, పట్టణ నాయకులు, కార్యకర్తల ముందే జరగడం విశేషంగా మారింది. ఎన్నికల సమయంలో సొంత పార్టీలోనే తలెత్తిన ఈ నేతల కుంపటి కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి పెద్ద తలనొప్పిగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంపై మంత్రి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాగా, నేతల మధ్య చోటుచేసుకున్న మాటల యుద్ధానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


