డిఫాల్ట్ మిల్లర్లకు మరో మూడు నెలల గడువు
బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం సడలింపు
కాకతీయ, పెద్దపల్లి : డిఫాల్ట్‌గా ఉన్న రైస్ మిల్లర్లకు బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం మరో మూడు నెలల గడువును పొడిగించింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడించారు.
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2014-15 నుంచి 2023-24 వరకు (రబీ 2022-23 సీజన్‌కు చెందిన వేలం పడ్డి మినహా) బకాయిలు ఉన్న మిల్లర్లు, తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. ఎఫ్‌ఆర్‌కే (ఫోర్టిఫైడ్ సన్నబియ్యం) రూపంలో లేదా నగదు రూపంలో బకాయిలకు సమానమైన మొత్తాన్ని 125 శాతం తో పాటు 12 శాతం వడ్డీతో చెల్లించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే ఇచ్చిన గడువు ముగియడంతో, బకాయిల వసూళ్లను వేగవంతం చేయడం మరియు పౌర సరఫరాల సంస్థ ప్రయోజనాలను కాపాడడం దృష్ట్యా ప్రభుత్వం గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ మార్చి 25న ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
డిఫాల్ట్ మిల్లర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, నిర్ణీత గడువులోపు బకాయిలను చెల్లించాలని కలెక్టర్ సూచించారు.


