కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ముగ్గురు మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి యాదగిరిగుట్టకు తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్వాల్‌కు చెందిన 9వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు, పాఠశాలలో బతుకమ్మ వేడుకలున్నాయని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లారు. అయితే సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో బాలికలు తార్నాక ప్రాంతంలో తిరుగుతుండగా, అక్కడే ముగ్గురు యువకులు వారిని ప్రేమిస్తున్నామని నమ్మించారు.
నిందితులు జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగి మధు (19), ఒక షాపింగ్ మాల్లో పనిచేసే వంశీ (22), అలాగే పెట్రోల్ బంక్ ఉద్యోగి నీరజ్ (21) గా పోలీసులు గుర్తించారు. వీరు ముగ్గురు బాలికలను తన మాటలతో నమ్మబలికి, యాదగిరిగుట్టకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
తరువాత సాయంత్రం తార్నాకకు తిరిగి వచ్చిన బాలికలు తీవ్ర షాక్‌లో ఏడుస్తూ తమ తల్లిదండ్రులకు వివరాలు తెలియజేశారు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు బాలికలకు కౌన్సెలింగ్ నిర్వహించి, అత్యాచారం జరిగినట్టు నిర్ధారించారు. ప్రస్తుతం మధు, వంశీ, నీరజ్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మైనర్ బాలికలపై ఇటువంటి ఘటనలు పెరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల కఠిన చర్యలతోనే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


