పోచారంలో ఘటనలో ముగ్గురి అరెస్టు
గోవుల తరలింపు సమాచారం ఇస్తున్నాడనే సోనూసింగ్‌పై కక్ష
తుపాకీతో సోనుసింగ్‌పై ఇబ్రహీం రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా నిర్ధారణ
కాకతీయ, హైదరాబాద్ : హైదరాబాద్ శివారులో పోచారం ఐటీ కారిడార్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు హనీఫ్ ఖురేషి పరారీలో ఉన్నాడు. బుధవారం సోనుసింగ్ అనే వ్యక్తిపై ఇబ్రహీం, అతని స్నేహితులు పాత కక్షలతో కాల్పులు జరిపారు. కీసర మండలం రాంపల్లికి చెందిన సోనుసింగ్ అలియాస్ ప్రశాంత్ గోసంరక్షణ కార్యకర్త. పశువుల అక్రమ రవాణాను గుర్తించి హిందూ సంఘాలకు సమాచారం చేరవేస్తుంటాడు. ఈక్రమంలో బుధవారం కారులో వెళ్తున్న సోనుసింగ్‌ను యమ్నంపల్లి వద్ద రౌడీషీటర్ ఇబ్రహీం అడ్డుకున్నాడు. గోవులను తరలిస్తున్న విషయం గోరక్షాదళ్‌కు అందిస్తున్నావంటూ సోనుసింగ్‌తో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్యా వాగ్వాదం పెరిగి.. ఒకరినొకరు నెట్టుకుంటూ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్లారు. గొడవ ముదరటంతో ఇబ్రహీం తుపాకీతో సోనుసింగ్‌పై రెండు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయాడు. బాధితుడికి యశోద ఆసుపత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి అతడి కాలేయం నుంచి తూటాను తొలగించారు.


