కాకతీయ, నెల్లికుదురు: ఇటీవల కలకలం రేపిన స్థానిక మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు వీరగాని రాధమ్మ హత్య కేసును పోలీసులు చేదించినట్లు తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ గణేష్, ఎస్సై చిర్ర రమేష్ బాబులతో కలిసి డి.ఎస్.పి కృష్ణ కిషోర్ సమావేశంలో వివరాలు తెలిపారు. మృతురాలు రాధమ్మ ఇంటి పక్కనే అంతకుమునుపు నిందితులు వీరగాని ఉప్పలయ్య, వీరగాని మహేష్ ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారని, అనంతరం సొంత ఇల్లును నిర్మించుకొని దూరంగా ఉంటూ జీవనం కొనసాగిస్తున్న తరుణంలో నిందితుడు ఉప్పలయ్యకు కొంతకాలంగా ఒంట్లో బాగుండడం లేదు .
ఏది చేసినా కలిసి రావడంలేదని దానికి కారణం పెద్దమ్మ అయినా మృతురాలు రాధమ్మ మంత్రాలు చేసిందన్న అనుమానంతో చంపాలని తమ్ముడు వీర గాని మహేష్ కు చెప్పగా ఒప్పుకొని ఇనుప రాడ్డును తీసుకొని ఇద్దరు అన్నదమ్ములు పథకం ప్రకారం ఈ నెల 12న రాధమ్మ గుడుంబా అమ్ముతుండడంతో తాగడానికి అని వెళ్లి రాత్రి 11 గంటలకు రాధమ్మను పిలవడంతో ఇంటి బయటకి వచ్చిన రాధమ్మను ఇనుపరాడితో చంపివేసి పక్కనున్న చేద బావిలో పడేశారు.
దువ్వ రాజు అనే వ్యక్తికి ఫోన్ చేసి బైక్ తీసుకురమ్మని చెప్పగా తీసుకువచ్చిన రాజు బండి పై ముగ్గురు కలిసి మహబూబాబాద్ రోడ్డు హెచ్ పి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకుని బ్రాహ్మణ కొత్తపెళ్లి ఆకేరు వాగు బ్రిడ్జి కి వెళ్లి వాగులో స్నానం చేసి జరిగిన విషయాన్ని దువ్వ రాజుకు చెప్పి భయపడుతుండగా రంగనాయక స్వామి ఆలయం పక్కకు ఉన్న దొంతుల నాగమణి బెల్ట్ షాపుకు రాజు తీసుకువెళ్లి మందు తాగించి ఇద్దరి అన్నదమ్ములను ఇంటికి పంపించాడు.
నిందితులకు సహకరించిన రాజు నిందితుడే కాబట్టి ముగ్గురిని అరెస్టు చేసినట్లు డిఎస్పి తెలిపారు. హత్య కేసులో గుర్తుతెలియని నిందితుల వివరాలను ఛేదించి నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ గణేష్, ఎస్సై చిర్ర రమేష్ బాబు, పిఎస్ సిబ్బంది శంకరయ్య, రవీందర్, సత్యనారాయణ, యాకయ్య, సుదీర్ లను డి.ఎస్.పి అభినందించారు.


