ఇసుక లారీలతో ముప్పు
చెల్లూరు వద్ద రహదారి అస్తవ్యస్తం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్–జమ్మికుంట ప్రధాన రహదారిపై చెల్లూరు గ్రామ పరిధిలో ఇసుక లారీల అక్రమ పార్కింగ్, నిర్లక్ష్య డ్రైవింగ్తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వందల సంఖ్యలో లారీలను రహదారి ఇరుపక్కల అడ్డగోలుగా నిలిపివేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రహదారి వెడల్పు తగ్గిపోవడంతో బస్సులు, ఇతర వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు ప్రమాదాలు తప్పడం కష్టంగా మారిందని డ్రైవర్లు వాపోతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో సరైన లైటింగ్ లేకుండా అతివేగంతో దూసుకొస్తున్న లారీలు ప్రమాద ముప్పును మరింత పెంచుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక లారీల అక్రమ పార్కింగ్, వేగ నియంత్రణపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని రహదారిని సురక్షితంగా మార్చాలని బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు, గ్రామస్తులు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు.


