హక్కు పత్రాల పేరుతో వేలల్లో వసూళ్లు
జాప్యాన్ని ఆసరాగా చేసుకుంటున్న దళారులు
‘డబ్బు ఇస్తే పని అయిపోతుంది’ అంటూ మభ్య పెడుతున్న వైనం
అధికారుల పాత్రపైనా నెలకొంటున్న అనుమానాలు
కాకతీయ, నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో గిరిజన రైతులకు భూమి హక్కు పత్రాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. భూమి హక్కు పత్రాల మంజూరులో జరుగుతున్న ఆలస్యాన్ని అవకాశంగా మలుచుకుని, అమాయక గిరిజన రైతులను మోసం చేస్తూ వేల రూపాయలు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నలిగిపోతుండగా, ఈ పరిస్థితినే దందాగా మార్చుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జాప్యమే దందాకు ఆయుధం
భూమి హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ నెలల తరబడి ఫైళ్లు కదలకపోవడంతో రైతుల్లో అసహనం పెరుగుతోంది. ఇదే పరిస్థితిని ఆసరాగా చేసుకున్న దళారులు “డబ్బు ఇస్తే వెంటనే పత్రాలు వస్తాయి” అంటూ రైతులను నమ్మించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. కొందరు రైతులు ఇప్పటికే డబ్బులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఈ వ్యవహారం బహిరంగంగానే కొనసాగుతుండటంతో అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారుల సహకారం లేకుండా ఇలాంటి దందా ఎలా సాగుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భూమి హక్కుల వంటి కీలక అంశంలో జరుగుతున్న అక్రమాలకు అధికారులు కన్నెర్ర చేయకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ దందాపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు డిమాండ్ చేస్తున్నారు. భూమి హక్కులు చట్టబద్ధంగా, పారదర్శకంగా మంజూరు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.


