- రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించిండ్రు
- బెస్ట్ అవేలబుల్ స్కూల్స్ స్కీం భూస్థాపితం ..
- జల్సాలకు డబ్బులున్నయ్ కానీ స్కాలర్‌షిప్స్‌కు లేవా..?
- కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏనుగుల రాకేష్‌రెడ్డి ఫైర్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : నిరుపేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వరమైన బెస్ట్ అవేలబుల్ స్కూల్స్ స్కీమ్ ను భూస్థాపితం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూజారిలేని గుడిలాగా, పంతులులేని బడిలాగా , వైద్యుడులేని వైద్యశాలగా తయారయిందని విమర్శించారు. 55 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి రూ. 200 కోట్లతో హెలికాప్టర్లలో తిరగడానికి డబ్బులు ఉన్నాయ్.. మంత్రులు జల్సాలు చెయ్యడానికి డబ్బులు ఉన్నాయ్.. కానీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ లు చెల్లించడానికి బెస్ట్ అవేలబుల్ స్కూల్స్ స్కీమ్ కు నిధులు లేవా అని ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
విద్యార్థులను రోడెక్కించారు
పలక బలపం పట్టి పాఠశాలల్లో ఉండాల్సిన చిన్నారులను రోడ్డున పడేసిన ఘనత రేవంత్ రెడ్డిదేనని , భరోసా కల్పించాల్సిన ప్రభుత్వమే బజారున పడేసిందని రాకేష్‌రెడ్డి ఫైర్ అయ్యారు. బెస్ట్ అవేలబుల్ స్కూల్స్ స్కీమ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బట్టి విక్రమార్క .. ఆర్థికశాఖ మంత్రి కాదు, వాయిదాల మంత్రి, వాటాల మంత్రిగా ఘనత సాధిస్తున్నారని ఎద్దేవ చేశారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, 2000 ప్రభుత్వ పాఠశాలల మూసివేత, గ్రూప్ -1 లో గోల్ మాల్, బెస్ట్ అవేలబుల్ స్కూల్స్ స్కీమ్ నిధులు కేటాయించకపోవడం. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వంటివి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా 23 నెలల్లో సాధించిన ఘనత అని దుయ్యబట్టారు. విద్యా శాఖ స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది కాబట్టి తక్షణమే పెండింగ్ లోనున్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, BAS నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


