- ‘మహా జాతర’ ఏర్పాట్లను సమీక్షీంచనున్న మంత్రులు
- భక్తుల సౌకర్యాల కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు
- 220 కోట్లతో ఊపందుకున్న జాతర పనులు
- సీతక్క, అడ్లూరి సహా ఓకే వేదికను పంచుకోనున్న కొండా, పొంగులేటి

కాకతీయ, ములుగు ప్రతినిధి: ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర 2026 ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులు దృష్టి సారించారు. ఈ మేరకు గృహ నిర్మాణం -రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ – స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ- అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వడ్లూరి లక్ష్మణ్ అన్ని శాఖల అధికారులతో నేడు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు విభిన్న శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయగా జాతర ఏర్పాట్ల పురోగతి పై ఈ సమీక్ష సమావేశం కీలకం కానుంది.
ముస్తాబవుతున్న మేడారం..
రానున్న జనవరి 28 నుంచి 31 వరకు జరగబోయే మేడారం మహా జాతరకు ఈమారు కోటి యాభై లక్షల మంది భక్తులు తరలివస్తారని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. భారీగా భక్తులు రావడంతో రహదారులు, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, విద్యుత్, శానిటేషన్, వైద్య సదుపాయాలు వంటి ఏర్పాట్లను విస్తృత స్థాయిలో చేపడుతున్నారు.
ముమ్మరంగా అభివృద్ధి పనులు..
మేడారం మహాజాతర 2026 దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తొలుత 150 కోట్ల రూపాయలు కేటాయించింది. తరువాత మేడారం వనదేవతల ఆలయా ప్రాంతాన్ని మరింత విస్తరించి అందంగా తీర్చిదిద్దే పనుల కోసం అదనంగా 70 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ వివరాలను ఈ నెల 13న జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. తల్లుల గద్దెల పరిసర ప్రాంతాల విస్తరణ, కొత్త రోడ్లు, తాత్కాలిక వసతిగృహాలు, పార్కింగ్ స్థలాలు, సీసీ కెమెరాలు, వైద్యశిబిరాలు, మురుగు నీటి పారుదల వ్యవస్థలు వంటి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
గడువులోపే పూర్తి చేయాలని లక్ష్యం..

రాష్ట్ర ప్రభుత్వం మహా జాతర పనులను వచ్చే 90 రోజులలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జాతర ప్రాంతం చుట్టుపక్కల మౌలిక వసతులను శాశ్వతంగా అభివృద్ధి చేయాలని కూడా మంత్రులు నిర్ణయించారు. ఈ సమావేశంలో అధికారులు శాఖ వారీగా చేపట్టిన పనుల పురోగతిని, జాతర సమయం ఇంకా 90 రోజులే ఉన్నందున సమయంలో పనులు ఎలా పూర్తి చేయాలని అంశంపై అధికారులకు ఆయా శాఖ మంత్రులు దిశా నిర్దేశం చేయనున్నారు. భక్తుల అంచనాలకు తగిన ఏర్పాట్లు కోసం ఇప్పటికే కావలసిన నిధులను ప్రభుత్వం మంజూరు చేసి అభివృద్ధి పనులను ప్రారంభించింది.
ఆసక్తికరంగా మారనున్న వేదిక..
ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య వివాదం ముగిసినట్టు తెలుస్తోంది. గతంలో మేడారంలో మంత్రి పొంగలి శ్రీనివాసరెడ్డి మీడియా ప్రతినిధుల సమక్షంలో తర్వాతి సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క, కొండ సురేఖ లతో కలిసి పాల్గొంటారని తెలిపారు. కాగా, నేడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఒకే వేదికపై కనిపించడం ఆసక్తికరంగా మారనుంది.


