ఈసారి హంగ్ మానే..!
కరీంనగర్ కార్పొరేషన్లో టైట్ ఫైట్
కాంగ్రెస్, బీజేపీ నెక్ టు నెక్… మేయర్ పీఠంపై ఉత్కంఠ
అన్ని సర్వేలు, పార్టీల అంచనాలు హంగ్ వైపే సూచన
రెబల్ అభ్యర్థులే కింగ్మేకర్లా..? సమీకరణాలపై పార్టీల ఫోకస్
ఫలితాలకు ముందే గెలిచే అవకాశమున్న స్వతంత్ర అభ్యర్థులతో మంతనాలు
గెలిస్తే మద్దతివ్వాలని కీలక పదవులు సైతం ఆఫర్..!
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈసారి స్పష్టమైన మెజారిటీ లేకుండా హంగ్ పరిస్థితికి దారితీయనున్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. మొత్తం 66 డివిజన్లున్న కార్పొరేషన్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 34 నుంచి 36 మధ్యలో ఉండగా, ఏ ఒక్క పార్టీ కూడా ఈ సంఖ్యను ఒంటరిగా చేరే పరిస్థితి లేదన్న అంచనాలు వ్యక్త మవుతున్నాయి. దీంతో మేయర్ ఎంపిక ఫలితాల అనంతరం జరిగే రాజకీయ సమీకరణాలపైనే ఆధారపడే పరిస్థితి నెలకొంది. ఒకటి లేదా రెండు స్థానాల తేడాతో.. మొత్తం అధికార సమీకరణాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉందన్న చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ – బీజేపీ మధ్యే నెక్ టు నెక్ పోటీ
ఈసారి కార్పొరేషన్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే కేంద్రీకృతమైందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అనేక డివిజన్లలో ఈ రెండు పార్టీల మధ్య స్వల్ప ఓట్ల తేడాతోనే గెలుపోటముల ఫలితాలు ఉంటాయనే రాజకీయ చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అదే ఆధిక్యాన్ని కార్పోరేషన్లోనూ కొనసాగించాలన్న లక్ష్యంతో ముందుకు సాగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కరీంనగర్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గట్టి పోటీ ఇచ్చింది. అన్ని సర్వేలు, పార్టీల అంతర్గత అంచనాలు కూడా ఈసారి హంగ్ పరిస్థితి తప్పదన్న సంకేతాలిస్తుండటం గమనార్హం.
గతంలో కార్పొరేషన్‌పై ఆధిపత్యం చెలాయించిన బీఆర్ఎస్ ఈసారి ప్రధాన పోటీలో వెనుకబడే పరిస్థితి కనిపిస్తున్నట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడం, మారిన రాజకీయ సమీకరణాలు, స్థానిక స్థాయిలో పెరిగిన పోటీ బీఆర్ఎస్ ప్రభావాన్ని తగ్గించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రెబల్ అభ్యర్థులపై ప్రధాన పార్టీల దృష్టి
ఈ ఎన్నికల్లో కొన్ని కీలక డివిజన్లలో రెబల్ అభ్యర్థులు బలంగా నిలిచారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్ దక్కని నాయకులు స్వతంత్రులుగా బరిలోకి దిగడంతో కొన్ని డివిజన్లలో పోటీ త్రికోణంగా మారింది. ఈ రెబల్ అభ్యర్థులే ఫలితాల తర్వాత అధికార సమీకరణంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్వల్ప మెజారిటీ తేడాలు ఉన్న చోట రెబల్స్ విజయం సాధిస్తే.. వారే కింగ్ మేకర్లుగా అవతరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫలితాలు వెలువడకముందే ప్రధాన పార్టీలు రెబల్ అభ్యర్థులతో ముందస్తు మంతనాలు ప్రారంభించినట్లు సమాచారం. గురువారం ఉదయం నుంచే స్వతంత్ర అభ్యర్థులతో సంప్రదింపులు కొనసాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన సంఖ్యను సాధించడంపై కాంగ్రెస్, బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇండిపెండెంట్లు, రెబల్ అభ్యర్థులే ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్లో తుది నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫలితాల తర్వాత జరిగే చర్చలు, ఒప్పందాలు, రాజకీయ సమీకరణాలే మేయర్ పీఠాన్ని నిర్ణయించే కీలక అంశాలుగా మారనున్నాయి. మొత్తంగా ఈసారి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు స్పష్టమైన మెజారిటీ లేకుండా హంగ్ పరిస్థితికి దారితీయనున్నాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.


