మేడారంలో సీఎం టూర్ షెడ్యూల్ ఇదే..!
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం పర్యటించనున్నారు. ముందుగా మేడారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోనున్నారు. అనంతరం స్థానిక పూజారులు, పెద్దలతో ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తారు. సమీక్ష అనంతరం మేడారం జాతర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను, కేటాయించిన నిధులను, మహాజాతర సమయంలో చేయబోయే ఏర్పాట్లపై బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అలాగే ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్ ను విడుదల చేస్తారు. గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు భంగం కలగకుండా ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా మేడారం అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.


