కాకతీయ, సినిమా డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన దంపతుల కుమార్తె క్లీన్‌కారా గురించి మెగా అభిమానుల్లో ఆసక్తి ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. పాప జన్మించినప్పటి నుంచి ఆమె ముఖాన్ని బయట ప్రపంచానికి చూపించకపోవడంతో, దీనిపై సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు, చర్చలు మొదలయ్యాయి. ఇక తాజాగా ఉపాసన ఓ కార్యక్రమంలో ఈ విషయంపై స్పందించి, తాము ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో వెల్లడించారు.
ఉపాసన మాట్లాడుతూ ..ఇప్పటి ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. ఎప్పుడు, ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కొన్ని సంఘటనలు తల్లిదండ్రులుగా నన్ను, చరణ్‌ను గందరగోళానికి గురి చేశాయి. అందుకే మా పాపకు స్వేచ్ఛ, గోప్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. బయట ప్రదర్శన కంటే, ఆమె చిన్ననాటి జీవితం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం అని వివరించారు.
ఆమె చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి .. పాప ముఖాన్ని దాచడం సరైన నిర్ణయమా కాదా అనేది మాకు తెలియదు. కానీ ప్రస్తుతం మేము చేస్తున్నది మాకు సౌకర్యంగా ఉంది. విమానాశ్రయానికి వెళ్తున్నప్పుడు కూడా పాప ముఖానికి మాస్క్ వేయడం కొంత కష్టం అయినా, అది అవసరమని మేము భావిస్తున్నాం. ఇప్పట్లో అయినా క్లీన్‌కారా ముఖాన్ని చూపించే ఉద్దేశం లేదు అని స్పష్టం చేశారు.
రామ్ చరణ్–ఉపాసన దంపతులు 2012లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 11 ఏళ్ల తర్వాత, 2023 జూన్ 20న క్లీన్‌కారా జన్మించింది. అప్పటి నుంచి పాప ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉన్నా, ముఖం మాత్రం ఎప్పుడూ చూపించలేదు. మొదటి పుట్టినరోజు నాటికి అయినా పాప ముఖం బయటపడుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.
ఉపాసన తాజా వ్యాఖ్యలతో, క్లీన్‌కారా ఫోటో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు ఇప్పుడు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అయినా, దంపతులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ, అభిమానులు చిన్నారికి ప్రేమాభిమానాలు వ్యక్తం చేస్తున్నారు.


